కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ (Hyderabad)లో విషాద ఘటన చోటుచేసుకుంది. బోండా తింటూ ఊపిరాడక ఓ లారీ డ్రైవర్ మృతి చెందిన సంఘటన యూసుఫ్‌గూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. నగరంలోని బోరబండకు చెందిన దాసరి రమేశ్ (45) లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. గురువారం అర్ధరాత్రి సుమారు ఒంటి గంట సమయంలో యూసుఫ్‌గూడలోని శ్రీకృష్ణ దేవరాయ నగర్ సమీపంలోని ఓ టిఫిన్ సెంటర్లో మైసూర్ బోండా తింటుండగా, బోండా గొంతులో ఇరుక్కొని ఊపిరాడక తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
కొంతసేపు ఊపిరాడక ఇబ్బందులు పడ్డ రమేశ్ అక్కడే కుప్పకూలిపోయారు. అర్ధరాత్రి కావడంతో ఆ సమయంలో ఎవరూ గమనించకపోవడంతో ఆయన అక్కడే ప్రాణాలు విడిచినట్లు తెలుస్తోంది. శుక్రవారం స్థానికులు రమేశ్ అచేతనంగా పడి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న యూసుఫ్‌గూడ పోలీసులు (Police) ఆయన అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Also: మళ్లీ కాస్టింగ్ కౌచ్ చర్చ మొదలు..!
Follow Us On : WhatsApp


