కలం, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఇటీవల కాస్టింగ్ కౌచ్ (Casting Couch) పై కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. మన శంకర వరప్రసాద్ గారు సక్సెస్ ఈవెంట్ లో మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీ అనేది అద్దం లాంటిది అని అన్నారు. అలాగే మనం ఏం ఇస్తే అదే మనకు తిరిగి వస్తుంది, ఇక్కడ కాస్టింగ్ కౌచ్ లేదు, మనం కమిట్మెంట్ తో ఉండాలి అంటూ చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో వైరల్ అయ్యాయి. సింగర్ చిన్మయి కూడా మెగాస్టార్ చేసిన కామెంట్స్ కి రిప్లై ఇచ్చింది.
తాజాగా టాలీవుడ్ సీనియర్ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ (Bharadwaja Thammareddy) చిరంజీవి చేసిన కామెంట్స్ కి కౌంటర్ ఇచ్చాడు. ఓ వీడియో ద్వారా మాట్లాడిన ఆయన, ఇండస్ట్రీలో వేధింపులు లేవని ఎవరూ చెప్పలేరని స్పష్టం చేశారు. వంద శాతం ఇలాంటి ఘటనలు ఉన్నాయని, కానీ అందరూ అలాంటి వారే అనడం సరికాదని అన్నారు. ప్రతి వ్యవస్థ ఉన్నట్లుగానే సినిమా రంగంలో కూడా కొందరు మహిళలను వస్తువులా చూసే ధోరణి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఏడాదికి దాదాపు 200 నుంచి 250 సినిమాలు నిర్మిస్తున్నారని, వాటిలో 30 నుంచి 40 సినిమాలు మాత్రమే ఇలాంటి తప్పుదోవలో తీస్తున్నారని తమ్మారెడ్డి పేర్కొన్నారు. కొంతమంది పెద్దలు లైంగిక వాంఛలు కోసం అవకాశాలను ఎరగా వేస్తున్నారనే ఆరోపణలను పూర్తిగా ఖండించలేమని చెప్పారు.
క్యాస్టింగ్ కౌచ్ (Casting Couch) విషయంలో చిన్మయి(Chinmayi) చెప్పింది కొంతవరకు నిజమేనని అంగీకరించారు. ఇక గతంలో తెలుగు సినీ పరిశ్రమలో వేధింపులపై ప్రభుత్వం కమిటీ వేసి నివేదిక సిద్ధం చేసిందని, అయితే అది ఇంకా బయటకు ఎందుకు రాలేదనేది తెలియదని చెప్పారు. అది కూడా రెండు నివేదికలు ఉన్నాయని తెలిపారు. ఒకటి ప్రభుత్వం వేసిన కమిటీ, మరొకటి ఉమెన్ వింగ్ తయారు చేసిందని వెల్లడించారు. దీంతో చిరంజీవి వ్యాఖ్యలపై చిన్మయి, తమ్మారెడ్డి అభిప్రాయాలతో క్యాస్టింగ్ కౌచ్ అంశం మరోసారి తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. ఇది వ్యక్తిగత ప్రవర్తనల సమస్యా? లేక వ్యవస్థాగత లోపమా? అన్న ప్రశ్న మళ్లీ చర్చకు వచ్చింది. భవిష్యత్తులోనైనా పరిశ్రమలో మహిళలకు సురక్షితమైన వాతావరణం ఏర్పడుతుందా అనేది వేచి చూడాల్సిందే.
Read Also: ఇదే నా చివరి మీటింగ్ : జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి
Follow Us On: Youtube


