కలం, వెబ్ డెస్క్: కరీంనగర్ సీపీ మతమార్పిడి చేస్తున్నారని తాను అనలేదని, తాను ఆ వ్యాఖ్యలు చేసినట్లు రుజువు చేస్తే రాజకీయాలు వదిలేస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) సవాల్ విసిరారు. ఇటీవల వీణవంక(Veenavanka)లో సమ్మక్క సారలమ్మ జాతరలో జరిగిన వివాదం నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డిపై కరీంనగర్(Karimnagar)లో కేసు నమోదైంది. కౌశిక్ రెడ్డి జాతరలో హైకోర్ట్ ఆదేశాలను ఉల్లంఘించారని, కరీంనగర్ సీపీ(CP) మత మార్పిడులు చేస్తున్నారంటూ అనుచినత వ్యాఖ్యలు చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే కౌశిక్ రెడ్డి క్షమాపణలు కూడా చెప్పారు. అయితే తాజాగా కౌశిక్ రెడ్డి తనపై వస్తున్న ఆరోపణలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఐపీఎస్ అసోసియేషన్(IPS Association) చేస్తున్న ఆరోపణలు అవాస్తవం అని, తాను మతమార్పిడుల గురించి వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. అలా మాట్లాడినట్లు చేసినట్లు రుజువు చేస్తే రాజకీయ సన్యాసం తీసుకునేందుకు సిద్ధమని ప్రకటించారు. తక్షణమే తనకు తెలంగాణ ఐపీఎస్ అసోసియేషన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే ఈ అంశంపై ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తానని ప్రకటించారు.


