కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్(Hyderabad)లోని బేగంపేట్(Begumpet)లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. శనివారం మధ్యాహ్నం కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్యాట్నీ సెంటర్ నుంచి బేగంపేట్ వరకు చాలాసేపు వాహనాలు ముందుకు కదల్లేదు. మామూలుగా వారాంతాల్లో సిటీలో ట్రాఫిక్ తక్కువగానే ఉంటుంది. కానీ, ఈరోజు ట్రాఫిక్ జామ్(Traffic Jam) నగరవాసులకు చుక్కలు చూపించింది. అలాగే సోమాజీగూడ నుంచి ప్యాట్నీకి వచ్చే వాహనదారులు ఇదే పరిస్థితి ఎదుర్కొన్నారు. సోమాజీగూడ, పంజాగుట్ట, ప్యాట్నీ, పారడైస్, ప్రకాశ్ నగర్, రసూల్ పుర ప్రాంతాల్లో రోడ్లపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. చాలా సేపు ట్రాఫిక్ లో ఇరుక్కుపోవడంతో వాహనదారులు అసహనం వ్యక్తం చేశారు. శుక్రవారం కూడా ఈ రూట్లో చాలా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ట్రాఫిక్ పోలీసులు సమన్వయం చేసుకొని ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాలని వాహనదారులు కోరుతున్నారు.


