పాకిస్థాన్(Pakistan) రాజధాని ఇస్లామాబాద్‌లో మంగళవారం ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. జిల్లా కోర్టు సమీపంలో ఈ దాడి జరిగింది. మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఇస్లామాబాద్(Islamabad) జిల్లా కోర్టు ప్రధాన ప్రవేశద్వారానికి సమీపంలో పార్క్ చేసి ఉంచిన కారులో మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఈ పేలుడు సంభవించింది. కారులో ముందుగానే గ్యాస్ సిలిండర్ అమర్చి ఉంచి, దానిని రిమోట్ కంట్రోల్ ద్వారా పేల్చివేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. పేలుడు ప్రభావంతో సమీపంలో ఉన్న పలు వాహనాలు దెబ్బతిన్నాయి. కొన్నింటికి మంటలు అంటుకున్నాయి.
చనిపోయినవారిలో ఎక్కువమంది న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, కేసుల విచారణకు వచ్చిన సాధారణ పౌరులు ఉన్నట్టు తెలుస్తోంది. గాయపడిన వారిని అత్యవసరంగా సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
దాడి జరిగిన వెంటనే పోలీసులు, రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని పూర్తిగా ముట్టడి చేసి తనిఖీలు జరుపుతున్నాయి. పేలుడు జరిగిన ప్రాంతంలో బాంబు డిస్పోజల్ స్క్వాడ్ కూడా శోధనలు చేపట్టింది. ఈ ఘటన నేపథ్యంలో ఇస్లామాబాద్ నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా ప్రభుత్వ భవనాలు, న్యాయస్థానాలు, విదేశీ రాయబార కార్యాలయాల వద్ద భద్రతా సిబ్బంది అప్రమత్తంగా మోహరించారు. దాడి వెనుక ఉగ్రవాద సంస్థల ప్రమేయం ఉన్న అవకాశం ఉందని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. భారత్ లోని ఢిల్లీ(Delhi)లో పేలుడు జరిగిన మర్నాడే అదే తరహా దాడి పాకిస్థాన్(Pakistan)లోనూ జరగడం గమనార్హం.
Read Also: ఉపఎన్నికలో రిగ్గింగ్.. సునీత సంచలన వ్యాఖ్యలు
Follow Us on: Instagram

