ఏదైనా ఫ్రీగా దొరుకుతుందంటే జనం ఎగబడటం సహజమే. అలా ఉచితంగా వచ్చేవాటికోసం వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. అప్పుడప్పుడు రోడ్ల మీద పాలవ్యాన్, లేదంటే బీరు సీసాల ట్రక్కు, తినుబండారాలు తరలిస్తున్న వాహనం ప్రమాదానికి గురైతే జనం ఆ యాక్సిడెంట్ గురించి మరిచిపోయి అందులోని వస్తువుల కోసం పరుగులు తీస్తుంటారు. తాజాగా అటువంటి ఘటనే హనుమకొండ(Hanumakonda) జిల్లా ఎల్కతుర్తి మండలంలో చోటు చేసుకున్నది. సిద్దిపేట–ఎల్కతుర్తి ప్రధాన రహదారి వెంబడి గుర్తుతెలియని వ్యక్తులు సుమారు రెండు వేల నాటు కోళ్లను వదిలివెళ్లారు. పొలాల మధ్య ఒక్కసారిగా వేలాది కోళ్లు తిరుగుతూ కనిపించడంతో గ్రామస్తులు తొలుత భయాందోళనకు గురయ్యారు. తర్వాత విషయం తెలిసి ఆసక్తితో వీటిని పట్టుకోవడానికి పరుగులు తీశారు. కొందరు మోటార్ సైకిళ్లతో, కొందరు ఆటోల్లో, మరికొందరు బస్తాలు చేత పట్టుకొని వెళ్లి కోళ్లు పట్టుకుని తమ ఇళ్లకు తీసుకెళ్లారు. “ఇంత పెద్ద సంఖ్యలో కోళ్లను ఎవరు వదిలారు?”, “వీటి వెనుక ఏదైనా వ్యాధి కారణమా?” అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఘటనపై పంచాయతీ కార్యదర్శి స్పందించారు. కొంతమంది పట్టుకున్న కోళ్లను స్వాధీనం చేసుకొని పశువైద్యాధికారుల వద్దకు పంపించామని చెప్పారు. వాటి ఆరోగ్య పరిస్థితి నిర్ధారించేందుకు వరంగల్ ల్యాబ్‌కి నమూనాలు పంపించారు. “ప్రస్తుతం ఈ కోళ్ల ఆరోగ్యం గురించి స్పష్టత లేదు. రిపోర్టు వచ్చే వరకు వీటిని వండకూడదు, తినకూడదు. ఎవరైనా ఇప్పటికే కోళ్లు పట్టుకున్న వారు ఉంటే, వాటిని పంచాయతీ కార్యాలయంలో అందజేయాలని కోరుతున్నాం,” అని పశువైద్యాధికారి దీపిక సూచించారు.
గ్రామంలో అయితే ఈ సంఘటన పెద్ద చర్చనీయాంశంగా మారింది. కోళ్లను తరలిస్తున్న లారీ దెబ్బతిన్న కారణంగా లేదా రవాణాలో ఏదైనా సమస్య తలెత్తడంతో కోళ్లను వదిలేసి ఉండవచ్చని అంటున్నారు. స్థానిక పోలీసులు కూడా ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు. సీసీ కెమెరా ఫుటేజీల ద్వారా లారీలు లేదా వాహనాల కదలికలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. రహదారి పక్కన వందలాది కోళ్లు తిరుగుతుండటంతో రవాణా వ్యవస్థకు కూడా కొంత అంతరాయం ఏర్పడింది.
Read Also: సీఎం రేవంత్ భాష మార్చుకోవాలి.. కవిత సూచన
Follow Us on: Youtube

