కేటీఆర్(KTR), కిషన్ రెడ్డి(Kishan Reddy) తెలంగాణ రాష్ట్రానికి బ్యాడ్ బ్రదర్స్ అని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆరోపించారు. గతంలో మర్రి శశిధర్ రెడ్డి, పీ జనార్దన్ రెడ్డిని హైదరాబాద్ బ్రదర్స్ అనేవారని.. ఇప్పుడు కేటీఆర్, కిషన్ రెడ్డి బ్యాడ్ బ్రదర్స్ గా ఉన్నారని పేర్కొన్నారు. వీరిద్దరూ కలిసి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. 2004-2014 మధ్య కాలంలో రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం వల్లే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని చెప్పారు. జూబ్లీహిల్స్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులే హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దాయని చెప్పుకొచ్చారు. మెట్రో ప్రాజెక్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు, ఓఆర్ఆర్ వంటికి కాంగ్రెస్ పాలనలోనే పూర్తి చేసుకున్నామని గుర్తు చేశారు.
ఓఆర్‌ఆర్, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్, మెట్రో రైలు
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన చొరవ వల్లే ఐటీ, ఫార్మా హబ్‌గా హైదరాబాద్ మారిందని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. యూపీఏ ప్రభుత్వం మంజూరు చేసిన ఐటీఐఆర్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్)ను ఎన్‌డీఏ ప్రభుత్వం రద్దు చేసిందని ఆయన విమర్శించారు. ‘ఐటీఐఆర్ అమలు జరిగి ఉంటే రాష్ట్రం మరింత వేగంగా అభివృద్ధి చెంది ఉండేదన్నారు. 2014 నుంచి కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) అధికారంలో ఉన్నా హైదరాబాద్‌లో ఎలాంటి గణనీయ అభివృద్ధి జరగలేదని సీఎం ఆరోపించారు. ‘2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉండగా, 2023 నాటికి బీఆర్‌ఎస్ నేతృత్వంలోని ప్రభుత్వం రూ.8 లక్షల కోట్ల అప్పులతో కాంగ్రెస్‌కు అప్పగించింది’’ అని అంటూ రేవంత్(Revanth Reddy) విమర్శించారు.
బీఆర్‌ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లకే కూలిపోయిందని, సచివాలయం, ప్రగతి భవన్, కమాండ్ కంట్రోల్ సెంటర్ వంటివి విలాసవంతమైనవి మాత్రమేనని విమర్శించారు. ‘కుమారుడిని ముఖ్యమంత్రి చేయాలని, వాస్తు సరిగా లేదని బాగున్న సచివాలయాన్ని కూల్చి కొత్తది కట్టారు. పేదలకు ఉపయోగం లేదు, కొత్త ఉద్యోగాలు రాలేదు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రతిపక్షాలు, మీడియాపై నిఘా కోసమే’’ అని ఆరోపించారు. మెట్రో రైలును పదేళ్లలో ఒక్క కిలోమీటరు కూడా పొడిగించలేదని, మంజూరైన పాతబస్తీ మెట్రోను పక్కన పెట్టారని, ఎల్ అండ్ టీ నష్టాలకు బీఆర్‌ఎస్ కారణమని తెలిపారు. ఇప్పుడు మెట్రో విస్తరణ, మూసీ రివర్‌ఫ్రంట్, రీజినల్ రింగ్ రోడ్, ఫ్యూచర్ సిటీ, గోదావరి జలాలు (20 టీఎంసీలు) తేవడం, ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, ఎలివేటెడ్ కారిడార్లను కిషన్ రెడ్డి, కేటీఆర్ అడ్డుకుంటున్నారని విమర్శించారు. వరదల సమయంలో కేంద్రం చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదని, కిషన్ రెడ్డి రూపాయి కూడా తీసుకురాలేదని ఆరోపించారు.
3 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాం
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిన్నరలోనే రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని సీఎం పేర్కొన్నారు. మెట్రో విస్తరణకు రూ.43 వేల కోట్ల ప్రణాళికలు కేంద్రానికి సమర్పించామని, 30 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కంటోన్మెంట్-శామీర్‌పేట, మేడ్చల్ ఎలివేటెడ్ కారిడార్లకు అనుమతులు తెచ్చి రూ.5 వేల కోట్లతో పనులు ప్రారంభించామని తెలిపారు. వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టులకు అనుమతులు, కొత్తగూడెం, రామగుండం ఎయిర్‌పోర్టులకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు.
ఓఆర్‌ఆర్‌ను రూ.లక్ష కోట్ల ఆదాయం వచ్చే ఆస్తి అని దాన్ని బీఆర్‌ఎస్ రూ.7 వేల కోట్లకు అమ్మేసిందని, 44 చెరువులను బీఆర్‌ఎస్ నేతలు కబ్జా చేశారని అంబర్‌పేటలో బతుకమ్మకుంటను ఎడ్ల సుధాకర్ రెడ్డి ఆక్రమించారంటూ పేర్కొన్నారు. చెరువుల పునరుద్ధరణపై రాజకీయం చేస్తున్నారని, అహ్మదాబాద్‌లో సబర్మతి, యూపీలో నది ప్రక్షాళనలాగా మూసీని క్లీన్ చేస్తామని చెప్పారు. 2047 నాటికి స్వాతంత్ర్యం వందేళ్లు పూర్తవుతుండగా, భవిష్యత్ ప్రణాళికలకు విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ‘‘అభివృద్ధి పనుల్లో పేదలకు నష్టం జరిగితే ఆదుకుంటాం, ఇళ్లు కోల్పోయినవారికి కొత్త ఇళ్లు నిర్మిస్తాం. మీ ఓటు ద్వారా హైదరాబాద్‌ను అభివృద్ధి చేసుకుందాం’’ అని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. దీపావళి రోజు డ్రగ్స్ కేసులను ఉదాహరణగా చూపుతూ, గత ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపారు. కాంగ్రెస్ హయాంలోనే నగరం అభివృద్ధి చెందిందని, ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‌ను గెలిపిస్తే పనులు వేగంగా జరుగుతాయని సీఎం నొక్కి చెప్పారు.
Read Also: ప్రభుత్వ పథకాలు ఆపడానికి రేవంత్ ఎవరు? హరీశ్ ఘాటు విమర్శలు
Follow Us on: Youtube

