ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జూబ్లీహిల్స్(Jubilee Hills) ఎన్నికల్లో ఓడిపోతామని రేవంత్ రెడ్డికి అర్థమైందని .. అందుకే ఓటర్లను ఆయన బెదిరిస్తున్నారని హరీశ్ మండిపడ్డారు. అందరినీ బెదిరించడమే రేవంత్ కు తెలిసిన విద్య అంటూ ఫైర్ అయ్యారు. ప్రభుత్వ పథకాలు ఆపడానికి రేవంత్(Revanth Reddy) ఎవరంటూ ప్రశ్నించారు. ఆయన తన ఇంట్లోనుంచి ఏమీ ఇవ్వడం లేదని.. ఆయన ఇచ్చేది ప్రజల సొమ్మేనని పేర్కొన్నారు. గతంలో ఓటమి భయంతో కంటోన్మెంట్ లో అనేక హామీలు ఇచ్చారని.. ఇప్పుడు అదే తరహాలో ఇస్తున్నారని పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డిని నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. శుక్రవారం ఆయన ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. “కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోతే పథకాలు ఆపుతామని రేవంత్ రెడ్డి ప్రజలను బెదిరిస్తాడా? రేవంత్ ఇంట్లోనుండి డబ్బులు వస్తున్నాయా లేదా ఆయన నాయన డబ్బులు ఇస్తున్నాడా? ప్రభుత్వానికి ప్రజలకు ఇచ్చే సొమ్ము ఇవ్వడం ప్రాముఖ్యత గల బాధ్యత” అని ప్రశ్నించారు.
ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిస్తే మరో మూడేండ్లు రాష్ట్ర ప్రజలు నరకయాతన అనుభవించాల్సి వస్తుందని హెచ్చరించారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో వికాసం జరిగితే, రేవంత్ రెడ్డి రెండేండ్ల పాలనలో అంతా విధ్వంసమే జరిగిందని విమర్శించారు. కంటోన్మెంట్ ఉప ఎన్నిక ముందు ఇచ్చిన ఒక్క హామీ కూడా రేవంత్ రెడ్డి అమలు చేయలేదని మండిపడ్డ హరీష్ రావు, రోడ్లన్నీ గుంతలమయమయ్యాయని, వీధి దీపాలు లేవని, కాంగ్రెస్ గెలిచిన తర్వాత కంటోన్మెంట్ నియోజకవర్గం నాశనమైందని ధ్వజమెత్తారు.
కంటోన్మెంట్ ఉప ఎన్నికలో గెలిపిస్తే 6 వేల ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని, రూ.23 కోట్ల స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మిస్తామని, డిఫెన్స్ భూములను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పిన హామీలన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఉన్నందుకే ముస్లింలు ఉన్నారని, తాము లేకుంటే ముస్లింలకు ఇజ్జత్ ఉండదని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడని విమర్శించిన హరీష్ రావు(Harish Rao), ముస్లింలు స్వాతంత్ర్యం కోసం యుద్ధం చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎక్కడుందని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ముస్లింలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
బీఆర్‌ఎస్ పార్టీ ప్రశ్నించడం వల్లే నేడు కాంగ్రెస్ మంత్రులు గల్లీల్లో పరుగులు పెడుతున్నారని విమర్శించారు. పీజేఆర్‌కు మంత్రి పదవి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టి, ఆయన మరణానికి కారణమైందే కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ ఎన్నికలు ఉన్నందున రేవంత్ రెడ్డికి ఎన్టీఆర్, పీజేఆర్ గుర్తుకు వస్తున్నారని, మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వాలని సోయి వచ్చిందని చెప్పారు. ఇవన్నీ ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్‌ఎస్ ఒత్తిడి పెంచడం వల్లనే జరిగాయని తెలిపారు.
Read Also: అమెరికాకు చైనా గట్టి సవాల్
Follow Us on: Instagram

