epaper
Wednesday, January 21, 2026
spot_img
epaper

బావబామ్మర్దుల్లో ఎవరి బలమెంత?

కలం, తెలంగాణ బ్యూరో : కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు.. బీఆర్ఎస్‌లో టాప్ ప్లేస్‌లు వీరివే. మొదటి నుంచీ పార్టీలో పెద్దమనిషిగా కేసీఆర్‌ది ప్రత్యేక స్థానం. అయితే పదేండ్ల అధికారంలోనైనా, ఇప్పుడు ప్రతిపక్షంలోనైనా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే ముందుంటున్నారు. క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు మాత్రం ట్రబుల్ షూటర్‌గా హరీశ్ రావు రంగప్రవేశం చేస్తున్నారు. బావబామ్మర్దులు హరీశ్ రావు, కేటీఆర్ మధ్య (KTR Vs Harish Rao) ఆధిపత్య పోరు ఉన్నదనే ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. “అలాంటిదేం లేదు.. కలిసే ఉన్నాం..” అంటూ ఇద్దరూ సంకేతాలు ఇస్తున్నారు. వీరిద్దరూ పార్టీలో రామలక్ష్మణులు లాంటివారని గులాబీ నేతలు గొప్పగానే చెప్పుకుంటారు. పార్టీలో నాయకత్వ బాధ్యతలను పోల్చుకుంటూ ఇద్దరి ప్రాధాన్యతల గురించి కేడర్‌లో చర్చ ఎప్పుడూ ఉంటున్నది.

కేడర్ బలమే వీరి స్ట్రెంగ్త్ కు సంకేతమా?

వీరిద్దరిలో ఎవరికి ఎక్కువ ఫాలోయింగ్, బలగం ఉందనేది శ్రేణుల్లో ఎప్పుడూ ఒక చర్చనీయాంశం. ఇతర పార్టీల్లోనూ వీరిద్దరిపై చర్చ కనిపిస్తుంది. అయితే ఎవరికి ఎంత బలం, బలగం ఉందో ప్రస్తుతం కీలక కేసుల దర్యాప్తుతో హాట్ టాపిక్‌గా మారింది. ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో కేటీఆర్ ఏసీబీ (ACB), ఈడీ (ED) విచారణకు హాజరైనప్పుడు ఆయన అనుచరులు భారీగానే రోడ్ల మీదికి వచ్చారు. తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావు విచారణ సందర్భంగానూ ఇదే కనిపించింది. కేడర్‌ను కంట్రోల్ చేయడానికి పోలీసులు ఒక దశలో లాఠీచార్జి అవసరమా అనేంత స్థాయికి వెళ్ళింది. ఇద్దరు కీలక నేతలు విచారణకు హాజరైనప్పుడల్లా రోడ్లమీదికి వచ్చే అనుచరుల బలమే వీరి బలానికి సంకేతం అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. వీరి పాపులారిటీకి ఈ బలప్రదర్శనే కొలమానం అనే మాటలూ వినిపిస్తున్నాయి.

కార్ రేస్ కేసులో కేటీఆర్.. :

ఫార్ములా ఈ-కార్ రేసు (Formula e-Car Race) కేసులో కేటీఆర్ నాలుగుసార్లు ఏసీబీ ఎంక్వయిరీకి, మనీ లాండరింగ్ ఆరోపణల్లో ఒకసారి ఈడీ విచారణకు హాజరయ్యారు. బంజారాహిల్స్ లోని ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్ వచ్చిన ప్రతిసారీ ఆయన అనుచరులు భారీగానే గుమికూడారు. మొదట తెలంగాణ భవన్ టు తెలంగాణ భవన్ వయా ఏసీబీ ఆఫీసు అనే తరహాలో వాహనాల ర్యాలీలో కేడర్ ఉత్సాహంగా పాల్గొన్నారు. జిల్లాల నుంచీ పెద్ద ఎత్తునే గులాబీ శ్రేణులు హైదరాబాద్ వచ్చారు. కేటీఆర్‌కు మద్దతుగా ఆందోళనలు చేపట్టారు. వారిని పోలీసులు చెదరగొట్టారు. కేటీఆర్‌ అనుకూల నినాదాలతో ఎంక్వయిరీనే ప్రభావితం చేసేలా పార్టీ ప్లాన్ చేసిందనే విమర్శలూ వచ్చాయి. కేసీఆర్ తర్వాత ఇక కేటీఆరే అనే వాతావరణం నెలకొన్నది. సెకండ్ ప్లేస్ కేటీఆర్‌దే అనేది ఎస్టాబ్లిష్ అయింది.

హరీశ్‌రావు వెంటా భారీ కేడర్ :

కాళేశ్వరం అవినీతి, అవకతవకలపై జస్టిస్ ఘోష్ కమిషన్ ముందు హరీశ్‌రావు హాజరైనప్పుడు అనుచరుల హడావుడి అంతగా లేదు. కానీ, మంగళవారం ఫోన్ ట్యాపింగ్ కేసులో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వచ్చినప్పుడు మాత్రం పెద్ద ఎత్తున అనుచరులు రోడ్డెక్కారు. ఠాణా పరిసరాలన్నింటినీ పోలీసులు బ్లాక్ చేయాల్సి వచ్చింది. ‘ఆరడుగుల బుల్లెట్టు.. ఇది ధైర్యం విసిరిన రాకెట్టు..’ అంటూ హరీశ్‌కు అనుకూల నినాదాలు చేశారు. ఎర్రోళ్ల శ్రీనివాస్ వంటి కొందరు సొమ్మసిల్లిపడిపోయారు. అసెంబ్లీలో పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రయారిటీ పెరిగిందనే వాదన కొందరిదైతే.. ప్రస్తుతం పార్టీ పరిస్థితికి తగినట్లుగా ఒరిజినల్ కెపాసిటీయే ఇంత.. అనేవారు ఇంకొందరు. పార్టీలో బావబామ్మర్దుల ప్రయారిటీని డిసైడ్ చేసేది కేడర్ చేపట్టే ఆందోళనలేననే వాదన తెరమీదకు వచ్చింది.

బలప్రదర్శనతో స్థాయి, స్థానం ఖరారు :

వీరిద్దరూ విచారణలకు హాజరయ్యేటప్పుడు కేడర్, అనుచరులు చేస్తున్న హడావిడి వారిపట్ల విధేయతకు నిదర్శనమైనా చివరకు అదే వారి అసలైన పాపులారిటీని డిసైడ్ చేస్తుందనే అభిప్రాయమూ శ్రేణుల్లో నెలకొన్నది. ఇద్దరి వెనక ర్యాలీ అవుతున్న కేడర్ సంఖ్యను, హడావిడిని విశ్లేషించుకుంటూ ఎవరికి ఎంత ఎక్కువ పాపులారిటీ, ఫాలోయింగ్ ఉన్నదో తేలిపోతుందనే మాటలూ వినిపిస్తున్నాయి. ఈ బలప్రదర్శనలతోనే పార్టీలో బావ బామ్మర్దుల్లో ఎవరు పాపులర్ లీడరో అర్థమవుతుందని ఇద్దరి వెనక ఉండే అనుచరులు స్పష్టతకు వస్తున్నారు. మొత్తానికి ఈ బలప్రదర్శన రానున్న రోజుల్లో వారి వెనక మొబిలైజ్ అయ్యే పార్టీ కేడర్ ఏ తీరులో ఉంటారనేదానికి శాంపిల్ మాత్రమేననేది వారి వాదన.

Read Also: ‘సిట్’ ముందుకు కవిత?.. త్వరలో సమన్లు జారీ?

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>