కలం, వెబ్‌డెస్క్: ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొన్న సొంత పౌరులపై ఇరాన్ జైళ్లలో జరిగిన దారుణ అకృత్యాలు (Iran Violence) వెలుగులోకి వస్తున్నాయి. మానవత్వం మంటగలిసేలా, ప్రజలపై ఖమేనీ ప్రభుత్వం సాగించిన దమనకాండ తెలిసి ప్రపంచం నివ్వెరపోతోంది. అప్పుడెప్పుడో హిట్లర్ జమానాలో జరిగిన కాన్సన్ట్రేషన్ క్యాంపుల ఘోరాలను తలపించేలా ఇరాన్ వ్యవహరించిన తీరు గుండెలు మెలిపెడుతోంది. ఈ ఘోరకలిలో ప్రాణాలతో తప్పించుకున్న బాధితులు, అయినవాళ్లను, ఆస్తులను కోల్పోయిన కుటుంబాల సభ్యలు మెసేజ్‌లు, వీడియోల ద్వారా వెళ్లబోసుకున్న గోడును అంతర్జాతీయ మీడియా బయటపెట్టింది.
తీవ్ర ఆర్థిక సంక్షోభం, పెరిగిన నిత్యావసర ధరలతో బతకు కష్టంగా మారడంతో నిరుడు డిసెంబర్లో ఇరాన్ ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలకు దిగిన సంగతి తెలిసిందే. మొదట వ్యాపారస్తులతో మొదలైన ఈ నిరసనలకు విద్యార్థులు, సాధారణ ప్రజలు జత కలవడంతో ఉద్ధృతంగా మారాయి. ఈ ఆందోళనలు.. 1979లో వచ్చిన ఇరాన్ విప్లవం కంటే ఎక్కువగా జరిగాయి. ‘ముల్లాస్ మస్ట్ గో’, ‘జావిద్ షా’ అంటూ నినాదాలు మిన్నంటాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ దిగిపోవాలని ఆందోళనకారులు గొంతెత్తారు.
అయితే, ఆందోళనలపై ఖమేనీ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడింది. ప్రభుత్వ దళాలకు తోడు, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్, ఇరాక్ నుంచి కరుడుగట్టిన హంతకులను రంగంలోకి దించింది. వేలాది మందిని పొట్టనపెట్టుకుంది. జైళ్లలో తోసింది. ఈ అకృత్యాలు (Iran Violence) ప్రపంచానికి తెలియకుండా ఇంటర్నెట్ నిలిపివేసింది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన హెచ్చరికలు, గల్ఫ్ కంట్రీస్ జరిపిన చర్చలతో ఆందోళనలు ప్రస్తుతం సద్దుమణిగాయి. పరిస్థితి కుదుటపడుతోంది. అయితే, ఇదే క్రమంలో ఇరాన్ జైళ్లలో జరిగిన దారుణాలు వెలుగులోకి వచ్చాయి.
గడ్డకట్టే చలిలో నగ్నంగా నిలబెట్టి..
ఆందోళనకారులపై జైళ్లలో పోలీసులు, జైలు సిబ్బంది దారుణంగా ప్రవర్తించారు. గదుల్లో పరిమితికి మించి జనాలను కుక్కారు. నిరసనకారులను దుస్తులు విప్పించి, గడ్డకట్టే చలిలో నగ్నంగా గంటల తరబడి నిలబెట్టారు. వాళ్లపై చల్లటి నీళ్లను పైపులతో పిచికారీ చేశారు. జననాంగాలపై లాఠీలతో కొట్టారు. నగ్న శరీరాలను తుపాకీ బారెళ్లతో గుచ్చుతూ ఆనందించారు. కొంతమందిపై లైంగిక దాడికి సైతం దిగారు. విషపు ఇంజెక్షన్లు చేశారు. మెడికల్ పిల్స్ తినిపించారు. ఇవన్నీ బయటికి రాకుండా ఉండడానికి ఇంటర్నెట్ ఆపేశారు. అయితే, స్టార్‌లింక్ ఉచితంగా సేవలు అందిస్తామని ప్రకటించడంతో ఆ నెట్వర్క్ రాకుండా చేయడానికి రష్యా, చైనా తయారీ జామర్లను వాడారు. ఎక్విప్మెంట్ను ధ్వంసం చేశారు.
కాల్చి చంపి.. బుల్లెట్లకు డబ్బులడిగారు!
జైళ్లలో దారుణాలతో పాటు పల్లెలు, పట్టణాలు తేడా లేకుండా దారుణ మారణకాండ సాగింది. దేశవ్యాప్తంగా దాదాపు 300 ప్రాంతాల్లో ఈ ఘోరకలి జరిగింది. ‘ప్రతి కుటుంబంలోనూ ఆ ఇంటి సభ్యులో, స్నేహితులో, బంధువులో, పొరుగింటివాళ్లో ఎవరో ఒకరు చనిపోయినట్లు’ బాధితుల్లో ఒకరు చేసిన మెసేజ్ పరిస్థితి తీవ్రతను చెబుతోంది. తజ్రిష్, నర్మక్ ఏరియాల్లో శవాల వాసనతో గాలి నిండిపోయింది. రోడ్లన్నీ రక్తంతో ఏరులై పారాయి. ఈ వీధులను మున్సిపాలిటీ సిబ్బంది నీళ్లతో శుభ్రం చేస్తున్నారు. ప్రతి కుటుంబంలోనూ ఒకరు లేదా ఇద్దరిని చంపివేసినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు బీబీసీకి వెల్లడించడం గమనార్హం. కాగా, సమాజం విస్తుపోయే మరో సంగతేంటంటే.. ఇరాన్ సాయుధ దళాలు.. ఆందోళనకారులను కాల్చి చంపి, తిరిగి ఆ కుటుంబాలనే బుల్లెట్లకు డబ్బులడిగాయి.
మృతుల లెక్కలు తగ్గించి..
ఇరాన్ ఆందోళనల్లో 4,029 మరణించారని, 5,811 మంది తీవ్రంగా గాయపడ్డారని, 26,015 మందిని జైళ్లలో తోశారని అమెరికా కేంద్రంగా పనిచేసే హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ న్యూస్ ఏజెన్సీ(హెచ్ఆర్ఏఎన్ఏ) వెల్లడించింది. అయితే, సీబీఎస్ న్యూస్ ప్రకారం దాదాపు 20వేల మంది చనిపోయినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్యను ఇరాన్ అధికారికంగా వెల్లడించనప్పటికీ, చనిపోయినవాళ్లలో భద్రత సిబ్బంది ఎక్కువగా ఉన్నట్లు చెబుతోంది.
Read Also: ట్రంప్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య
Follow Us On : WhatsApp


