కలం, వెబ్ డెస్క్: ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నితిన్ నబిన్ (Nitin Nabin) రాజ్యసభకు వెళ్లబోతున్నారా? ఆయన ప్రస్తుతం బీహార్ నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే బీజేపీ జాతీయ అధ్యక్షుడు కావడంతో ఎమ్మెల్యేగా ఉండటం కంటే రాజ్యసభ నుంచి ఎంపీగా ఉండటమే మేలని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం జాతీయ మీడియాలో ఇదే చర్చ జరుగుతోంది. నితిన్ నబిన్ ప్రస్తుతం బీహార్‌లోని బ్యాంకీపూర్ ఎమ్మెల్యే. ఈ సెగ్మెంట్ నుంచి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇదిలా ఉంటే నితిన్ నబిన్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు కావడంతో ఆయన ఫోకస్ మొత్తం జాతీయ రాజకీయాలమీదే ఉంటుంది.
దానికితోడు వివిధ రాష్ట్రాల్లో బీజేపీ బలోపేతంపై దృష్టి పెట్టాలి. ఆయా రాష్ట్రాల్లో బీజేపీలో ఏమైనా అంతర్గత సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించాలి. దీంతో ఆయన ఎంపీగా ఉంటే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నదట. ఎమ్మెల్యేగా, బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా రెండు బాధ్యతలు తలకెత్తుకొనే బదులు రాజ్యసభ సభ్యుడిగా ఉంటే ఢిల్లీలోనే ఉంటూ పార్టీ వ్యవహరాలు చక్కబెట్టే అవకాశం ఉంటుందని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. త్వరలో వివిధ రాష్ట్రాల్లో రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యే అవకాశం ఉంది. దీంతో ఆయనను రాజ్యసభకు పంపించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఐదు రాజ్యసభ స్థానాలు ఖాళీ
ఏప్రిల్‌లో బీహార్ నుంచి ఐదు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. సంఖ్యాబలం ప్రకారం వాటిలో కనీసం రెండు స్థానాలు బీజేపీకి దక్కే అవకాశం ఉంది. మరో రెండు స్థానాలు నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూకు దక్కనున్నాయి. బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తే ఐదో స్థానాన్ని కూడా దక్కించుకునే అవకాశముందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది దేశవ్యాప్తంగా మొత్తం 30 ఇతర రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. దీంతో నితిన్ నబీన్ (Nitin Nabin) బీహార్ లేదా? ఇతర రాష్ట్రం నుంచి రాజ్యసభకు వెళ్లే అవకాశం ఉంది.
అయితే బీజేపీ జాతీయ అధ్యక్షుడైతే కచ్చితంగా రాజ్యసభకు ఎన్నిక కావాలన్న నిబంధన ఏమీ లేదని కూడా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. 2013లో అమిత్ షాను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఆపై 2014లో జాతీయ అధ్యక్షుడిగా నియమించినప్పుడు ఆయన గుజరాత్ నరణపురా ఎమ్మెల్యేగా కొనసాగారు. గుజరాత్ అసెంబ్లీ సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. 2017లోనే ఆయనను రాజ్యసభకు పంపగా, 2019లో గాంధీనగర్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. కాబట్టి నితిన్ నబిన్ ఎమ్మెల్యేగా కొనసాగే అవకాశాలూ లేకపోలేదు.
త్వరలో రాష్ట్రాల పర్యటన
బీజేపీ జాతీయ అధ్యక్షుడు త్వరలో వివిధ రాష్ట్రాల్లో పర్యటించబోతున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్ పెట్టబోతున్నారు. ఆయా రాష్ట్రాల నేతలు ఈ భేటీలో పాల్గొననున్నారు. సంస్థాగత అంశాలపై విస్తృత చర్చ సాగుతోంది. పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడం, ప్రధానమంత్రి రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’ను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే మార్గాలపై వంటి కార్యక్రమాలపై నితిన్ నబిన్ దృష్టి సారించబోతున్నారు.
‘వికసిత్ భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ) చట్టం’పై దేశవ్యాప్త అవగాహన కార్యక్రమం ప్రారంభించేందుకు ప్రత్యేక వ్యూహాన్ని రూపొందించే అవకాశముందని సమాచారం. త్వరలో ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్ పై నితిన్ నబిన్ ఫోకస్ పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. పశ్చిమబెంగాల్‌లో ఎలాగైనా గెలవాలని బీజేపీ భావిస్తోంది. ఇందులో భాగంగా కొత్త అధ్యక్షుడు ఈ రాష్ట్రంపై ఫోకస్ పెట్టారు. ఈ ఎన్నికలు నితిన్‌కు ఒక పరీక్షగా మారనున్నాయి. ఇటీవల బీజేపీకి ఇదే అతిపెద్ద, అత్యంత కఠినమైన ఎన్నికల సవాలుగా బెంగాల్‌ను భావిస్తున్నారు.
Read Also: ‘అసంఘటిత’ కార్మికులకు గుడ్‌న్యూస్.. అటల్ పెన్షన్ యోజన పొడిగింపు
Follow Us On: Sharechat


