epaper
Wednesday, January 21, 2026
spot_img
epaper

హైదరాబాద్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఫాలోఅప్ సదస్సు : సీఎం రేవంత్ రెడ్డి

క‌లం వెబ్ డెస్క్ : ప్రతి ఏడాది జులై లో హైదరాబాద్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) ఫాలో-అప్ సదస్సు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రతిపాదించారు. దావోస్‌లో జరిగిన ‘జాయిన్ ది రైజ్’ కార్యక్రమంలో ఈ ప్రతిపాదనకు గ్లోబల్ బిజినెస్ లీడర్లు, పాలసీ నిర్ణేతలు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. ఈ రోజుల్లో పెట్టుబడుల ఒప్పందాలు, వ్యాపార వాణిజ్య నిర్ణయాలకు ఒక సంవత్సరం చాలా ఎక్కువ సమయమని ముఖ్యమంత్రి అన్నారు. అందుకే ప్రతి ఏడాది జులై లేదా ఆగస్టులో హైదరాబాద్‌లో ఫాలో-అప్ ఫోరం నిర్వహించాలని వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్​ ప్రతినిధులకు సూచించారు.

హైదరాబాద్‌లో ఇటీవల నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయవంతమైందని, రూ.5.75 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు ఆకర్షించిందని సీఎం తెలిపారు. ‘ప్రతి ఏడాది మేము ఎంవోయూలపై సంతకాలు చేయడానికి దావోస్‌కు వస్తాం.. కానీ ఈసారి గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కావటంతో, తెలంగాణ రైజింగ్ విజన్, ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న పాలసీలను ప్రపంచానికి చూపించడానికి వచ్చాం” అని తెలిపారు. హైదరాబాద్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు (GCCs) ప్రధాన కేంద్రంగా మారిందని సీఎం అన్నారు. మూసీ నది పునరుజ్జీవనంతో పాటు (Musi Rejuvenation) రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేసి నైట్ టైమ్ ఎకానమీపై దృష్టి పెడ‌తామని చెప్పారు. దేశంలోనే 24 గంటలు పనిచేసే తొలి నగరంగా హైదరాబాద్‌ అభివృద్ధి చేస్తామన్నారు.

భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని ప్రకటించారు. ఇందులో 50 శాతం కంటే ఎక్కువ గ్రీన్ కవర్ ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యమెంట్ లక్ష్యాలను ప్రదర్శించారు. అదే వేదికపై తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్ (TAIH), తెలంగాణ నెక్స్ట్-జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026–2030ను ఆవిష్కరించారు.

సమావేశంలో పాల్గొన్న మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి హైదరాబాద్ లో మెట్రో రైలు విస్తరణ, చెరువులు కుంటల పునరుజ్జీవనం వంటి గేమ్-చేంజర్ ప్రాజెక్టులను వివరించారు. కొత్తగా ప్రతిపాదించిన కోర్, ప్యూర్, రేర్ అర్థిక వృద్ధి జోన్ల ప్రణాళికలను ప్రస్తావించారు. తెలంగాణకు అపారమైన పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని, సాంకేతికత, అనుభవం, నైపుణ్యాల పరంగా గ్లోబల్ కంపెనీల సహకారం స్వీకరిస్తామని అన్నారు. ప్రముఖ నటుడు చిరంజీవి ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముఖ్యమంత్రితో కలిసి ఆయన విందులో పాల్గొన్నారు.

Read Also: మేడారంలో కుక్క‌కు తులాభారం వేసిన న‌టి.. భ‌క్తుల‌ ఆగ్ర‌హం

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>