కలం, వెబ్‌డెస్క్: కాంగ్రెస్‌వి అభివృద్ధి నిరోధక రాజకీయాలు అని, అది గుర్తించిన దేశ ప్రజలు పదేపదే తిరస్కరిస్తున్నా ఆ పార్టీ తీరు మారడం లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు. అస్సాంలో (Assam) రెండో రోజు పర్యటిస్తున్న ప్రధాని మోదీ ఆదివారం అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. రెండు అమృత్ భారత్ రైళ్లను వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలుపు, కాంగ్రెస్ ఘోర పరాభవం గురించి ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీకి చురకలు వేశారు.
‘కొన్నేళ్లుగా ఎన్నికలు స్పష్టమైన సందేశాన్నిస్తున్నాయి. అదేంటంటే ఈ దేశం కాంగ్రెస్ నెగటివ్ పాలిటిక్స్‌ను క్రమం తప్పకుండా తిరస్కరిస్తోంది. ఇటీవల జరిగిన మహారాష్ట్ర మున్సిపోల్స్(BMC) ఇదే విషయాన్ని మరోసారి రుజువు చేశాయి. ఏళ్ల తరబడి మహారాష్ట్రను ఏలిన కాంగ్రెస్ ప్రస్తుతం అక్కడ పూర్తిగా కనుమరుగయ్యే స్థితిలో ఉంది. ఇక ఆ పార్టీ పుట్టిన ముంబైలో అయితే ఇప్పటికే ఐదో స్థానానికి దిగజారింది. ఆ పార్టీ ప్రజల నమ్మకాన్ని ఎప్పుడో కోల్పోయింది’ అని ప్రధాని అన్నారు.
చొరబాటుదార్లకు భూమి తాకట్టు పెట్టారు..
ఎంతో ఘన చరిత్ర ఉన్న అస్సాంను కాంగ్రెస్ అథోగతి పాలు చేసిందని ప్రధాని మోదీ (PM Modi) మండిపడ్డారు. ఓట్ల రాజకీయాల కోసం చొరబాటుదార్లకు అస్సాం భూమిని ఆ పార్టీ తాకట్టు పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అస్సాంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పథంలో సాగుతోందని చెప్పారు. బోడో సమస్యకు చెక్ పెట్టిందన్నారు. అస్సాం సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షణకు బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.
ఫస్ట్ చాయిస్ బీజేపీ..
ప్రస్తుతం దేశ ప్రజల ఫస్ట్ చాయిస్‌గా బీజేపీ నిలిచిందని ప్రధాని మోదీ అన్నారు. గత ఏడాదిన్నర్రగా బీజేపీకి మద్దతు స్థిరంగా పెరుగుతోందని ఆయన చెప్పారు. ‘ఇటీవల కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి అద్భుతమైన మద్దతు లభించింది. మొట్టమొదటిసారి కేరళ రాజధాని తిరువనంతపురంలో బీజేపీ అభ్యర్థి మేయర్ అయ్యారు. అంతకుముందు బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో, ఇప్పడు మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లోనూ బీజేపీకి జనం పట్టంకట్టారు’ అని ప్రధాని గుర్తుచేశారు.
అంతకుముందు రూ.6,950 కోట్లతో నిర్మించనున్న కజిరంగా ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్ట్‌కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఎన్‌హెచ్–716పై కలియబోర్–నుమాలిఘర్ మధ్య నిర్మించనున్న ఈ కారిడార్ అటవీ జంతువులు ప్రమాదాల బారిన పడకుండా కాపాడుతుందని, పర్యావరణానికి మేలు కలిగిస్తుందని ప్రధాని చెప్పారు. అలాగే గౌహతి–రోహ్తక్, దిబ్రూఘర్– లక్నో మధ్య రెండు అమృత్ భారత్ రైళ్లను ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు.
Read Also: టీడీపీని తొక్కేసిన బీఆర్ ఎస్ ను బొందపెట్టండి : సీఎం రేవంత్ రెడ్డి
Follow Us On: Sharechat


