కలం, వెబ్ డెస్క్: పాకిస్థాన్ (Pakistan) క్రికెట్‌లో మరోసారి వింత చర్చ మొదలైంది. పాక్ యువ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ చేసిన ఓ వ్యాఖ్య సోషల్ మీడియా వేదికగా నవ్వులు పూయిస్తోంది. ఇటీవల వైరల్ అయిన ఓ వీడియోలో ఫర్హాన్ తన అభిమాన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ, సయీద్ అన్వర్ పేర్లను పక్కన పెట్టి అహ్మద్ షెహజాద్‌ను ఎంపిక చేశాడు. ప్రపంచ క్రికెట్‌లో లెజెండ్స్‌గా నిలిచిన ఆటగాళ్లను కాదని షెహజాద్‌ను ముందుకు తెచ్చిన తీరు పెద్ద చర్చకు దారి తీసింది.
ఈ వ్యాఖ్యపై సోషల్ మీడియా (Social Media)లో విస్తృత రిస్పాన్స్ వచ్చింది. దీనిపై నెటిజన్లు సరదా కామెంట్లతో స్పందించగా, పాక్ మాజీ క్రికెటర్లు కూడా స్పందించారు. బాసిత్ అలీ ఈ వీడియో నిజమేనా అన్న అనుమానం కూడా వ్యక్తం చేశాడు. ఇది ఫేక్ అయి ఉండాలని అభిప్రాయపడ్డాడు. సచిన్ కంటే షెహజాద్‌ను ఎంచుకోవడం నమ్మశక్యం కాదని వ్యాఖ్యానించారు.
కమ్రాన్ అక్మల్ మాత్రం నవ్వు ఆపుకోలేకపోయారు. ఫర్హాన్ ఆలోచించి మాట్లాడాల్సిందని అన్నాడు. షెహజాద్ అభిమాన ఆటగాడిగా ఉండొచ్చుగానీ సచిన్, సయీద్ అన్వర్‌ల కంటే గొప్పవాడిగా చెప్పడం సరైనది కాదని స్పష్టం చేశారు. ఫర్హాన్ వ్యాఖ్యలతో మొదలైన ఈ అంశం ఇప్పుడు పాక్ క్రికెట్ వర్గాల్లో కామెడీగా మారింది. యువ ఆటగాళ్లు మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ఈ అంశం మరోసారి గుర్తు చేసిందని సీనియర్లు అంటున్నారు.


