epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

క‌ళ్ల‌ ముందే మదర్ డెయిరీ కొలాప్స్!

కలం, నల్లగొండ బ్యూరో : మదర్ (నార్మూల్) డెయిరీ (నల్లగొండ-రంగారెడ్డి జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం) కళ్ల ముందే కొలాప్స్ అవుతోంది. ఒకటీ కాదు.. రెండూ కాదు.. దాదాపు 15 ఏండ్లుగా కొంతమంది అక్రమార్కులు ఒక్కో ఇటుక కూల్చుతూ వస్తున్నారు. దీంతో మదర్ డెయిరీ (Mother Dairy) మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఒకరిద్దరి అక్రమ సంపాదన కోసం.. లక్షలాది మంది పాడి రైతుల జీవనోపాధి చిధ్రమవుతున్నది. వందలాది మంది ఉద్యోగుల బతుకులను రోడ్డుకీడ్చారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. అతితక్కువ టైమ్‌లోనే మదర్ డెయిరీ (Mother Dairy)ని మూసేయడం ఖాయమనే ఆందోళన నెలకొన్నది. ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, పాలకులు అక్రమార్కులకు కొమ్ముకాయడంతో లాభాల్లో పయనించాల్సిన డెయిరీ ఏకంగా రూ.40 కోట్ల నష్టాల ఊబిలోకి కూరుకుపోయింది. రూ.కోట్లు విలువజేసే డెయిరీ ఆస్తులు బ్యాంకు తనఖాల్లో చిక్కుకుపోయాయి. ఈ క్రమంలోనే ఇటీవల మదర్ డెయిరీలో అంతర్గత పోరు రచ్చకెక్కింది. డెయిరీ చైర్మన్ రాజీనామా చేయాలంటూ డైరెక్టర్లు పట్టుబట్టడంతో చైర్మన్ మధుసూదన్ రెడ్డి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.

రూ.40 కోట్ల వరకు నష్టాలు..

నల్లగొండ- రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకారం సంఘం మొదట్నుంచీ లాభాల బాటలోనే నడిచింది. కానీ 2009 తర్వాత నుంచి డెయిరీలో అక్రమాలు మొదలయ్యాయి. గత 15 ఏండ్ల కాలంలో రూ.కోట్లలో అవినీతి జరిగింది. ఆయా కాలాల్లో పనిచేసిన చైర్మన్లు, కొంతమంది డైరెక్టర్లు అధికారులతో కుమ్మక్కై డెయిరీ ఆదాయాన్ని పక్కదారి పట్టించారు. అయితే మదర్ డెయిరీ చైర్మన్‌గా గుత్తా జితేందర్ రెడ్డి సుదీర్ఘకాలం పాటు పనిచేశారు. ఈ క్రమంలో పెద్దఎత్తున ఆరోపణలు రావడం.. చైర్మన్‌గిరీ గుత్తా వర్గీయుల చేతుల్లోంచి బయటపడాలనే డిమాండ్‌తో బీఆర్ఎస్ సర్కారు హయాంలో చైర్మన్ పదవి ఇతరులకు దక్కింది. ఇక అక్కడి నుంచి డెయిరీలో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగుచూశాయి. ఇటీవల రాజీనామా చేసిన మధుసూదన్ రెడ్డి 2024లో చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించేనాటికి రూ.35.15 కోట్ల నష్టాల్లో డెయిరీ ఉన్నట్టు సాధారణ సర్వసభ్య సమావేశం తీర్మానంలో చూపెట్టారు. అదే తీర్మానంలో పాడి రైతుల శ్రేయస్సు కోసం రూ.1.84 కోట్లు లాభం ఉన్నట్టు పేర్కొన్నారు. అయితే అప్పటికే డెయిరీకి సంబంధించిన చాలా ఆస్తులు బ్యాంకుల్లో తనఖా పెట్టడంతో గత పాలకవర్గం నష్టాలను లాభాలుగా చూపించి బోగస్ ఆడిట్ రిపోర్టు తయారుచేసినట్టు సమాచారం.

ఎండీ కనుసన్నల్లో అక్రమాలు..

మదర్ డెయిరీ ఎండీ కృష్ణ అక్రమాల చిట్టా భారీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఏకంగా చిల్లింగ్ కేంద్రాల్లోనే పాల కల్తీకి దందా లేపినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే మాల్, మల్లేపల్లి, కందుకూరులోని చిల్లింగ్ సెంటర్లలో పాలను కల్తీ చేయడంతో ఎండీ కృష్ణపై పోలీసులు కేసు సైతం నమోదైంది. ఇంతటితో ఆగకుండా పాల డిస్ట్రిబ్యూటర్లకు రూల్స్‌కు విరుద్ధంగా లీటరుకు రూ.2 అదనంగా చెల్లించడం.. ప్రైవేటు పాలు కొనుగోలు చేసి మదర్ డెయిరీ బ్రాండ్‌తో విక్రయించడం.. తదితర ఆరోపణలు వెల్లువెత్తాయి. ఒకానొక సందర్భంగా ఎండీ కృష్ణను తొలగించాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించినా డైరెక్టర్లు పట్టించుకోలేదు సరికదా ఎండీతో కుమ్మక్కై రూ.10 కోట్లకు పైగా అక్రమాలకు తెరలేపారు. ఇంత జరిగినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం కొసమెరుపు.

రైతులకు భారీగా బకాయిలు..

మదర్ డెయిరీ పాడిరైతుల నుంచి పాలు సేకరిస్తోంది. అలా సేకరించిన పాలకు ప్రతి 15 రోజులకోసారి బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. అయితే నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలో పరిధిలో దాదాపు 3 నెలలకు పైగా పాడి రైతులకు బకాయిలు పేరుకుపోయాయి. దీంతో పాడిరైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాడిరైతులు రోజూ పాలను ప్రైవేటుగా అమ్ముకోలేక మదర్ డెయిరీలో పాలుపోస్తే బిల్లులు రాక అవస్థలు పడుతున్నా పాలకవర్గం పట్టించుకోవడం లేదు. నిజానికి మదర్ డెయిరీ ప్రొడక్ట్స్ మంచి డిమాండ్ ఉంటుంది. బహిరంగ మార్కెట్‌లోనూ ప్రైవేటు డెయిరీలు దూసుకెళ్తున్నాయి. కానీ మదర్ డెయిరీ మాత్రం నష్టాల్లో కూరుకుపోవడం చర్చనీయాంశంగా మారుతోంది. మరోవైపు మరో ప్రభుత్వ డెయిరీ విజయ సైతం కొంతమేర లాభాల్లోనే నడుస్తోంది. ఇప్పటికైనా పాలకులు మదర్ డెయిరీ సంగతి ఏంటో తేల్చాల్సిందే.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>