కలం, స్పోర్ట్స్ : భారత్, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ మధ్య జరుగుతున్న వివాదం సమయంలో బంగ్లాదేశ్ ఆటగాళ్లు (Bangladesh Cricketers) కీలక నిర్ణయం తీసుకున్నారు. అన్ని ఫార్మాట్ల మ్యాచ్‌లను బాయ్ కాట్ చేస్తామంటూ తమ దేశ క్రికెట్ బోర్డ్ బీసీబీని (BCB) హెచ్చరించారు. బీసీబీ డైరెక్టర్ ఎం. నజ్ముల్ ఇస్లాం రాజీనామా చేయాలని, అప్పటి వరకు ఏ మ్యాచ్ ఆడమని వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగా మాజీ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్‌ను “భారతీయ ఏజెంట్”గా నజ్ముల్ ఇస్లాం (Nazmul Islam) అభివర్ణించడం ఈ వివాదానికి కారణమయింది.
ఈ వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. ప్రస్తుత క్రికెటర్లు కూడా వాటిని ఖండిస్తూ క్షమాపణ చెప్పాలి డిమాండ్ చేశారు. ఈ అంశంపై క్రికెటర్ల సంఘం అధ్యక్షుడు మహ్మద్ మిథున్ మాట్లాడుతూ.. ప్రారంభం కానున్న బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లకు ముందు నజ్ముల్ ఇస్లాం తన పదవి నుంచి తప్పుకోకపోతే అన్ని మ్యాచ్‌లను నిలిపివేస్తామని స్పష్టం చేశారు. ఈ నిర్ణయాన్ని బుధవారం జరిగిన వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ప్రకటించారు.
ఇదిలా ఉండగా, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఈ వివాదాస్పద వ్యాఖ్యల నుంచి దూరంగా నిలిచింది. అవి అనుచితమైనవని పేర్కొంటూ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. అలాంటి వ్యాఖ్యలు బీసీబీ విలువలకు గానీ అధికారిక వైఖరికి గానీ సరిపోవని బోర్డు స్పష్టం చేసింది. అలాగే బంగ్లాదేశ్ క్రికెట్‌కు సేవ చేసే బాధ్యతలో ఉన్న వ్యక్తుల నుంచి ఆశించే ప్రవర్తనా ప్రమాణాలకు కూడా అవి విరుద్ధమని తెలిపింది.

Read Also: తమిళనాడులో జల్లికట్టు షురూ!
Follow Us On : WhatsApp


