కలం వెబ్ డెస్క్ : ఇరాన్(Iran)లో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశ గగనతలాన్ని (Airspace) తాత్కాలికంగా మూసివేశారు. దీంతో అంతర్జాతీయ విమానాల(International Flights)పై తీవ్ర ప్రభావం పడింది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఇరాన్ గగనతలం మీదుగా ప్రయాణించే ఎయిర్ ఇండియా(Air India), ఇండిగో(IndiGo) విమానాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లిస్తున్నట్లు ఆయా సంస్థలు తెలిపాయి. ఈ కారణంగా కొన్ని విమానాలు ఆలస్యమవుతుండగా, కొన్ని రూట్లలో మార్గం మార్చడం సాధ్యం కాకపోవడంతో విమానాలను రద్దు చేయాల్సి వచ్చిందని వెల్లడించింది. ప్రయాణికులు విమానాశ్రయానికి బయలుదేరే ముందు తమ విమాన స్థితిని అధికారిక వెబ్సైట్లో పరిశీలించాలని ఆయా సంస్థలు సూచించాయి. ఈ అనూహ్య పరిస్థితుల వల్ల కలిగిన అసౌకర్యానికి విమానయాన సంస్థలు విచారం వ్యక్తం చేసింది. ప్రయాణికులు, సిబ్బంది భద్రతే తమకు ప్రాధాన్యమని స్పష్టం చేసింది. ఇదే అంశంపై ట్రావెల్ అడ్వైజరీని కూడా విడుదల చేశాయి. ఈ పరిణామాలు తమ నియంత్రణలో లేవని, ప్రయాణ ప్రణాళికలకు ఆటంకం కలిగినందుకు క్షమాపణలు చెప్పాయి. ప్రయాణికులు వెబ్సైట్లో ఫ్లెక్సిబుల్ రీబుకింగ్ ఎంపికలు లేదా రీఫండ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపాయి.


