కలం, వెబ్‌డెస్క్: తమిళనాట రాజకీయం సినిమాల చుట్టూ నడుస్తోంది. ఇప్పటికే టీవీకే అధినేత, నటుడు విజయ్ నటించిన ‘జన నాయగన్’ (Jana Nayagan) చుట్టూ వివాదాలు ముసురుకోగా, ఇప్పుడు లిస్ట్‌లోకి ‘పరాశక్తి’ (Paraasakthi) సినిమా చేరింది. శివకార్తికేయన్ నటించిన ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. మరోవైపు ఆ పార్టీ నాయకుడు, లోక్‌సభలో ప్రతి పక్ష నేత రాహుల్ గాంధీ.. ‘జన నాయగన్’కు సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్ నిరాకరించడంపై మంగళవారం ‘ఎక్స్’ వేదికగా ప్రధాని మోదీని విమర్శించారు. ఈ క్రమంలో రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ నేత, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Tamilisai) ఘాటుగా స్పందించారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సినిమాలను అడ్డుకుందని, ఇప్పుడేమో రాహుల్ నీతులు చెబుతున్నారని ఆమె మండిపడ్డారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటనలో కాంగ్రెస్, రాహుల్ తీరును ఎండగట్టారు.
‘ జన నాయగన్ గురించి మాట్లాడే అర్హత రాహుల్‌కు (Rahul Gandhi) లేదు. అతని పార్టీ ఎమర్జెన్సీ మొదలుకొని ఎన్నో సార్లు భావ ప్రకటన స్వేచ్ఛను కూనీ చేసింది. ఎన్నో సినిమాలను అడ్డుకుంది. కుట్టచరిత్రం అనే తమిళ సినిమాను ఏకంగా ఏడాది పాటు బ్యాన్ చేసింది. ఇప్పుడేమే రాహుల్.. జన నాయగన్‌ను అడ్డుకోవడం తమిళ సంస్కృతిపై దాడి అని అంటున్నారు. హిందీ వ్యతిరేక ఉద్యమం సమయంలో తమిళుల గొంతు నొక్కింది, వందలాది స్టూడెంట్లను కాల్చి చంపింది కాంగ్రెస్ కాదా? శ్రీలంకలో వేలాది తమిళులను ఊచకోత కోస్తున్నా నోరెత్తకుండా ఉన్నది కాంగ్రెస్–డీఎంకే గవర్నమెంట్ కాదా? అంతెందుకు తెలంగాణలో పుష్ప–2 సినిమా రిలీజ్ టైంలో థియేటటర్ వద్ద అభిమానుల కారణంగా జరిగిన సంఘటనకు సినీ నటుడు అల్లు అర్జున్ (Allu Arjun) ను అరెస్ట్ చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ కాదా?’ అని తమిళిసై (Tamilisai) ప్రశ్నించారు. తమిళుల సంస్కృతి, సంప్రదాయాల గురించి రాహుల్ మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఆమె ధ్వజమెత్తారు.
పరాశక్తిపై వివాదం ఏంటి?
తమిళ నటుడు శివకార్తికేయన్ హీరోగా వచ్చిన సినిమా పరాశక్తి. ఇది 1960 వ దశాబ్దంలో తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమం ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమాలో ఇందిరా గాంధీతో సహా అనేక మంది కాంగ్రెస్ నేతలను తప్పుగా చిత్రీకరించారంటూ, ఈ మూవీని బ్యాన్ చేయాలని తమిళనాడు యూత్ కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. కాగా, ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ 23 కట్స్ చెప్పి, యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ సినిమాకు తెలుగు మహిళ సుధ కొంగర దర్శకత్వం వహించారు.
Read Also: భారత్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలతో రెచ్చిపోయిన పాకిస్తాన్
Follow Us On: Sharechat


