కలం, వెబ్ డెస్క్ : సంక్రాంతి పండుగ వేళ.. ఓ ఊరు అగ్నికి ఆహుతి అయింది (Kakinada Fire Accident). సంతోషంగా జరుపుకోవాల్సిన పండుగ రోజు కట్టుబట్టలతో రోడ్డు పాలయ్యారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఊరు మొత్తం కాలిపోయింది. కాకినాడ జిల్లా మన్యం గ్రామం సార్లంకపల్లెలో జరిగిన ఈ ఘోర అగ్ని ప్రమాదం 40 కుటుంబాలకు తీవ్ర విషాదం నింపింది. పండుగ వేళ తమకు కావాల్సిన వస్తువులు, బట్టలను కొనుగోలు చేయడానికి గ్రామ ప్రజలు సోమవారం సమీపంలో ఉన్న తుని, తదితర ప్రాంతాలకు వెళ్లారు.
దాదాపు గ్రామస్తులు ఎవరూ గ్రామంలో లేరు. ఈ క్రమంలో సాయంత్రం ఓ వ్యక్తి ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగింది. అగ్నిరాజుకుని గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో అగ్ని వ్యాపించడంతో గ్రామంలో ఉన్న పూరి గుడిసెలకు మంటలు అంటుకున్నాయి. గ్రామంలో దాదాపు అన్నీ పూరి గుడిసెలే ఉండడంతో ఒకదాని నుంచి మరోవాటికి మంటలు వ్యాపించి 40కి పైగా గుడిసెలు కాలి బూడిదై పోయాయి.
అగ్ని ప్రమాదం ద్వారా దుస్తులు, నగదు, వస్తువులు అన్ని కాలిపోయి లక్షల రూపాయల నష్టం వాటిల్లింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, గ్రామం దూరం ఉండడంతో అగ్నిమాపక వాహనాలు వెళ్లే సరికే గుడిసెలన్నీ కాలిపోయాయి. జరిగిన నష్టంపై అధికారులు అంచనా వేస్తున్నారు. గ్రామస్తులకు టెంట్లు, దుస్తులు తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నారు.

Read Also: రూ.3 లక్షల దిశగా దూసుకెళ్తున్న సిల్వర్.. పుత్తడి ధర ఎంతంటే?
Follow Us On : WhatsApp


