అవినీతిని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని ఉత్తరాఖండ్(Uttarakhand) సీఎం పుష్కర్ సింగ్ ధామి స్పష్టం చేశారు. రాష్ట్రమంతా అవినీతిపై ప్రజా అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ‘విజిలెన్స్- అవర్ షేర్ రెస్పాన్సిబిలిటీ’ (‘అవగాహన- మనందరి బాధ్యత’) పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో సీఎం కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు. ‘‘అవినీతిని సహించేది లేదని అన్ని శాఖలు తెలపాలి. అన్ని శాఖల్లో పారదర్శకత ఉండాలి. అవినీతి విషయంలో రాజీ అన్న పదానికి కూడా స్థానం ఉండకూడదు.
ఎట్టి పరిస్థితుల్లో అవినీతికి పాల్పడకూడదని, అవినీతి నేరమని ప్రజలకు తెలపాలి. లంచం తీసుకోవడమే కాదు.. ఇవ్వడం కూడా నేరమని ప్రజలకు వివరించాలి. ఎవరైనా అధికారి లంచం అడిగితే ఏం చేయాలి? ఎవరిని సంప్రదించాలి? ఎలా సంప్రదించాలి? వంటి వివరాలను ప్రజలకు తెలపడమే ఈ కార్యక్రమం లక్ష్యం. ఉత్తరాఖండ్(Uttarakhand)ను అవినీతి రహిత రాష్ట్రంగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యం’’ అని ఆయన(Pushkar Singh Dhami) స్పష్టం చేశారు.

