గంజాయి బ్యాచ్‌పై ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను పోలీసులు వేధించి, బెదిరింపులకు గురి చేయడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన వారాసిగూడ(Warasiguda)లో చోటు చేసుకుంది. అక్టోబర్ 23న వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయ్ బ్యాచ్ రెచ్చిపోయింది. సజ్జాద్, సోహైల్ అనే ఇద్దరిపై దాడి చేసింది. అనంతరం సోహైల్ అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడి కుటుంబ సభ్యులను అసభ్యకర భాషలో తిట్టి, బెదిరింపులకు గురి చేశారు. ఈ ఘటనపై ఫిర్యాదు చేయడం కోసం సజ్జద్ భార్య రజియా.. వారాసిగూడ పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. కాగా, అక్కడ ఎస్ఐ ఫిర్యాదు నమోదు చేసుకోకపోగా తమను వేధించాడని, బెదిరింపులకు గురిచేశాడని రజియా ఆరోపించారు.
‘‘నేను, మా అత్త ఇద్దరం ఆడవాళ్ళం వెళ్తే సజ్జాద్, సోహైల్ వస్తేనే కంప్లైంట్ తీసుకుంటామని రాత్రి 12 గంటల వరకు మమ్మల్ని కూర్చోబెట్టారు. ఆ సమయంలో స్టేషన్లో ఒక్క మహిళా పోలీసు కూడా లేదు. వెళ్లిపోతామంటే తన భర్తను, అతడి స్నేహితుడిని అరెస్ట్ చేస్తామని పోలీసులు బెదిరించారు. రాత్రి 12 గంటలకు ఇంటికి వెళ్లాక, మరుసటి రోజు అదే ఎస్ఐ పదే పదే కాల్ చేసి బెదిరించాడు. పోలీస్ స్టేషన్‌కు పిలిపించి.. తాను చెప్పినట్లు వీడియో స్టేట్మెంట్ ఇవ్వాలని బలవంతం చేశారు. అంతేకాకుండా ఆ రోజు కూడా మమ్మల్ని రాత్రి 11 గంటల వరకు నిర్బంధించాడు’’ అని రజియా పేర్కొన్నారు. ఈ ఘటనపై వారాసిగూడ(Warasiguda) పోలీసులపై మలక్‌పేట అదనపు డీసీపీని కలిసి ఫిర్యాదు చేశామని, గంజాయ్ బ్యాచ్‌పై కేసు నమోదు చేసి తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని ఆమె కోరారు.
Read Also: వీధి కుక్కలకు టీకాలు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు సీరియస్

