epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

మిగులు జలాలను వాడుకుంటే తప్పేంటి? : ఏపీ మంత్రి నిమ్మల

కలం, వెబ్ డెస్క్: రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) స్పష్టం చేశారు. ఈ లక్ష్య సాధనలో భాగంగా చేపట్టిన నల్లమల సాగర్ ప్రాజెక్టుపై అనవసర రాజకీయాలు, అపోహలు సృష్టించవద్దని సూచించారు. తెలంగాణ రాష్ట్రంతో వివాదాలు పెట్టుకోవాలనే ఉద్దేశం తమకు ఏమాత్రం లేదని, కేవలం మిగులు జలాలను మాత్రమే వినియోగించుకునే ప్రయత్నమే చేస్తున్నామని మంత్రి వివరించారు. ప్రతి ఏడాది సుమారు 3 వేల టీఎంసీల గోదావరి జలాలు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయని మంత్రి గుర్తు చేశారు. ఆ నీటిని వినియోగించుకొని రాయలసీమ వంటి కరువు ప్రాంతాల్లో సాగు చేస్తే తప్పేమిటని ప్రశ్నించారు. దేశంలో నీటి కొరత తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న మిగులు జలాలను ఉపయోగించుకోవడం అనివార్యమని పేర్కొన్నారు.

నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో చట్టాలను అతిక్రమించే ఆలోచన ప్రభుత్వానికి లేదని నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. కేంద్ర జలసంఘాలు, నిపుణుల సూచనలు, చట్టపరమైన అనుమతులు అన్నీ తీసుకున్న తర్వాతే ముందుకు వెళ్తామని తెలిపారు. ఏ రాష్ట్ర హక్కులను కాలరాయాలనే ఉద్దేశం లేదని, సమాఖ్య స్ఫూర్తితోనే వ్యవహరిస్తామని చెప్పారు. కృష్ణా జలాల పంపిణీ అంశం గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలకు కారణమవుతోంది. ఈ నేపథ్యంలో నల్లమల సాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన పిటిషన్ సోమవారం సుప్రీంకోర్టు విచారణకు రానుంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) స్పందిస్తూ ప్రభుత్వ వైఖరిని స్పష్టంచేశారు. రాయలసీమ వంటి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నీటి వనరులే కీలకమని, రైతుల జీవితాల్లో మార్పు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి మరోసారి పునరుద్ఘాటించారు. మిగులు జలాల వినియోగంపై రాజకీయాలకు తావులేకుండా, వాస్తవాలను అర్థం చేసుకోవాలని ఆయన సూచించారు.

తెలంగాణ అభ్యంతరం ఏమిటి?

నల్లమల సాగర్ ప్రాజెక్ట్‌ను ఏపీ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుండటంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ చట్టపరంగా, సాంకేతికంగా, రాష్ట్ర హక్కుల పరంగా అనేక సమస్యలను కలిగిస్తుందని తెలంగాణ వాదిస్తోంది. గోదావరి నదిలో “మిగులు జలాలు” అన్న పదానికి చట్టబద్ధమైన నిర్వచనం లేదని తెలంగాణ ప్రభుత్వం అంటున్నది. ట్రిబ్యునల్ ద్వారా గోదావరి జలాల తుది కేటాయింపులు జరగకముందే, ఏపీ ప్రభుత్వం మిగులు జలాల పేరుతో కొత్త ప్రాజెక్టులను చేపట్టడం సరికాదని అభిప్రాయపడుతోంది. ప్రస్తుతం వినియోగం జరగకపోయినా, భవిష్యత్తులో తెలంగాణ అవసరాలు పెరిగే అవకాశాన్ని పరిగణనలోకి తీసుకోకుండా నీటిని మళ్లించడం రాష్ట్ర హక్కులకు భంగం కలిగిస్తుందని చెబుతోంది.

ప్రత్యేక అనుమతులు అవసరం

నల్లమల సాగర్ ప్రాజెక్ట్ గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్‌కు నీటిని మళ్లించే (ఇంటర్-బేసిన్ ట్రాన్స్‌ఫర్) ప్రాజెక్ట్ కావడంతో దీనిపై ప్రత్యేక అనుమతులు తప్పనిసరిగా అవసరమని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. కేంద్ర జలశక్తి శాఖ, గోదావరి నది యాజమాన్య బోర్డు, కృష్ణా నది యాజమాన్య బోర్డు, సంబంధిత రాష్ట్రాల సమ్మతి లేకుండా ముందడుగు వేయడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని అభ్యంతరం తెలిపింది. గోదావరి ఎగువ ప్రాంతాల్లోనే తెలంగాణకు చెందిన కీలక ప్రాజెక్టులు ఇంకా పూర్తిస్థాయిలో అమలులోకి రాలేదని ప్రభుత్వం గుర్తుచేస్తోంది. తెలంగాణ ప్రాజెక్టుల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకోకుండా ఏపీ నీటిని మళ్లిస్తే, తెలంగాణకు కేటాయించిన నీటి వాటాపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. నల్లమల అటవీ ప్రాంతం పర్యావరణపరంగా అత్యంత సున్నితమైన ప్రాంతమని, అక్కడ లిఫ్ట్ సాగునీటి ప్రాజెక్ట్ చేపట్టాలంటే పర్యావరణ, అటవీ, వన్యప్రాణి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. ఈ అనుమతుల విషయంలోనూ ఏపీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిబంధనలు పాటించలేదన్నది తెలంగాణ అభ్యంతరం.

సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నప్పుడు ప్రాజెక్టు నిర్మాణమా?

గోదావరి జలాల పంపిణీ అంశం ఇంకా ట్రిబ్యునల్, సుప్రీంకోర్టు పరిధిలో ఉండగానే ఏపీ ప్రభుత్వం ప్రాజెక్ట్ పనులను ముందుకు తీసుకెళ్లడం న్యాయవ్యవస్థను ధిక్కరించినట్టేనని తెలంగాణకు చెందిన సాగునీటి రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే నల్లమల సాగర్ ప్రాజెక్ట్‌పై స్టే విధించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మొత్తంగా గోదావరి జలాలను మిగులు అని ఏకపక్షంగా ప్రకటించే హక్కు ఏపీకి లేదని, అన్ని రాష్ట్రాల సమ్మతి, చట్టబద్ధ అనుమతులు లేకుండా నల్లమల సాగర్ ప్రాజెక్ట్ ముందుకు సాగడం సరికాదన్నదే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన వాదనగా కొనసాగుతోంది.

Read Also: అమరావతిపై మాజీ సీఎం జగన్ అలా.. సజ్జల ఇలా..!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>