కలం, వెబ్ డెస్క్ : అమరావతి రాజధానిపై మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) తీరు సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది. 2019 ఎన్నికలకు ముందు తాను అమరావతి రాజధానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. ఎన్నికల్లో గెలిచి సీఎం అయ్యాక మూడు రాజధానులు అన్నారు. అవేవీ ఫలించలేదనుకోండి. ఇక ఓడిపోయాక కొన్నాళ్లపాటు అమరావతి విషయంలో సైలెంట్ గా ఉన్నారు. ఆ మధ్య సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala) మాట్లాడుతూ.. అమరావతి రాజధానిగా ఉండటంలో జగన్ కు ఎలాంటి అభ్యంతరాలు లేవని.. తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు.
కానీ మొన్న జనవరి 8న జగన్ మీడియా ముందుకొచ్చి.. అమరావతి (Amaravati) నదీగర్భంలో ఉందని.. దానికి చట్టబద్ధత లేదని.. దాన్ని పూర్తి చేయడానికి రూ.2లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారంటూ మాట్లాడారు. నదీ గర్భంలో ఒక్క బిల్డింగ్ కూడా కట్టరని.. అలాంటిది అమరావతి అనే నగరాన్ని ఎలా కడుతారంటూ ప్రశ్నించారు. అమరావతిని గుంటూరు-విజయవాడ హైవేకు ఆనుకుని కట్టాలని మరోసారి పేర్కొన్నారు జగన్. ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలన్నారు. జగన్ చేసిన వ్యాఖ్యలపై రకరకాల చర్చలు జరిగాయి. ఇంతలోనే మళ్లీ సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala) మీడియా ముందుకు వచ్చి.. జగన్ ఎన్నడూ అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడలేదని.. అమరావతిలో నిర్మాణాల పేరుతో జరుగుతున్న అవినీతిని ప్రశ్నిస్తే సమాధానాలు చెప్పకుండా జగన్ మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.
అయితే ప్రతిసారి అమరావతిపై జగన్ ఉద్దేశమేంటో సజ్జల ఎందుకు క్లారిటీ ఇచ్చుకోవాల్సి వస్తోందని ఆ పార్టీలోనే చర్చ జరుగుతోంది. జగన్ స్వయంగా అమరావతికి మద్దతు ఇస్తున్నట్టు ఒక మాట చెబితే ఇంత చర్చ జరిగే ఛాన్స్ ఉందదు కదా అంటున్నారు వైసీపీలోని కింది స్థాయి కార్యకర్తలు. అమరావతి రాజధానికి జగన్ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు సజ్జల చెప్పడం దేనికి.. అదేదో జగన్ చెబితే.. అప్పుడు నిర్మాణాల పేరుతో జరుగుతున్న అవినీతిని ప్రశ్నిస్తే దాని ఇంపాక్ట్ ఇంకా బలంగా ఉండేదని వైసీపీలోనే చర్చలు మొదలయ్యాయి. సజ్జల మాట్లాడేలోపే.. అవతల కూటమి పార్టీలు జగన్ రాజధానికి వ్యతిరేకం అంటూ ప్రచారాన్ని హోరెత్తించేశాయి. కాబట్టి కూటమి పార్టీలకు జగన్ అలాంటి ఛాన్స్ ఇవ్వొద్దని వైసీపీ కేడర్ కోరుకుంటోంది.
Read Also: పవన్ జీవితం సనాతన ధర్మానికి వ్యతిరేకం : సీపీఐ నారాయణ
Follow Us On : WhatsApp


