కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్‌లో జిల్లా మాల మహానాడు ఆధ్వర్యంలో నూతనంగా గెలిచిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు వార్డు సభ్యుల సన్మాన కార్యక్రమంలో మంత్రి జి.వివేక్ వెంకటస్వామి (Vivek Venkataswamy), ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ (Shabbir Ali) ముఖ్య అతిథులుగా పాల్గొని సన్మానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ, మాలల హక్కుల కోసం భవిష్యత్తు కార్యాచరణపై ప్రత్యేక దృష్టి పెడతానని చెప్పారు. ఈరోజు ఇక్కడ సన్మానం పొందుతున్నామంటే అది బాబా సాహెబ్ పెట్టిన భిక్ష అన్నారు. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల వల్లే ఈ రాజకీయ అధికారం దక్కింద.. ఈ అధికారాన్ని కేవలం కుటుంబాల కోసమే కాకుండా, సమాజం కోసం వాడాలని సూచించారు. మౌలిక వసతుల కల్పన గ్రామాల్లో మాల పల్లెల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించేలా కృషి చేస్తానని మంత్రి జి.వివేక్ హామీనిచ్చారు.
అనంతరం మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ గెలుపులో మాల సామాజిక వర్గం ప్రాముఖ్యతను వివరించారు. స్థానిక సంస్థల్లో ఎన్నికైన ప్రజా ప్రతినిధులు గ్రామ అభివృద్ధికి వెన్నెముక అని తెలిపారు. ముఖ్యంగా మాల సామాజిక వర్గం నుండి ఎన్నికైన సర్పంచ్‌లు, వార్డు సభ్యులు బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అట్టడుగు వర్గాల గొంతుక కావాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ దళిత వెనుకబడిన వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. పదవులు రావడం ముఖ్యం కాదు, ఆ పదవుల ద్వారా ప్రజలకు ఎంత సేవ చేశామన్నదే ముఖ్యం అన్నారు షబ్బీర్ అలీ.
నిజామాబాద్ పట్టణంలో జి.వెంకటస్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు పెద్దపల్లి జిల్లాకు ఆయన పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరుతామని షబ్బీర్ అలీ తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా, గడుగు గంగాధర్, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చిన్నయ్య, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు దేవిదాస్, లింబాద్రి, టీఎన్జీవో నాయకులు కిషన్, తదితరులు పాల్గొన్నారు.

Read Also: సీఎం ఆఫీస్ నుంచే ఘోస్ట్ సైట్లు: మాజీ మంత్రి సంచలన ఆరోపణలు
Follow Us On: X(Twitter)


