epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

సత్తుపల్లిలో భారీ సైబర్ దోపిడీ.. 18 మంది నిందితుల అరెస్ట్

కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం జిల్లా సత్తుపల్లి (Sathupalli) కేంద్రంగా సాగుతున్న భారీ అంతర్జాతీయ సైబర్ నేరాల ముఠాను పోలీసులు గుట్టురట్టు చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన పేరుతో వల విసిరి, సుమారు 547 కోట్ల రూపాయల మేర మోసాలకు పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదివారం పెనుబల్లి పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. గత నెల 24వ తేదీన సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామానికి చెందిన మోదుగ సాయికిరణ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ భారీ ఉదంతం వెలుగులోకి వచ్చింది.

ఈ ఫిర్యాదుపై లోతుగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు, సత్తుపల్లికి చెందిన పోట్రు మనోజ్ కళ్యాణ్, ఉడతనేని వికాస్ చౌదరి నేతృత్వంలోని గ్యాంగ్ ఈ వ్యవస్థీకృత నేరాలకు పాల్పడినట్లు గుర్తించారు. ఈ ముఠాకు వివిధ రూపాల్లో సహకరించిన మరో 18 మందిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.

విస్తుపోయేలా బ్యాంక్ లావాదేవీలు..

కేసు విచారణలో భాగంగా నిందితులు, వారి కుటుంబ సభ్యులు, అనుచరుల బ్యాంక్ ఖాతాలను పరిశీలించిన పోలీసులకు దిగ్భ్రాంతి కలిగించే అంశాలు వెల్లడయ్యాయి. ప్రధాన నిందితుడు పోట్రు మనోజ్ కళ్యాణ్ ఖాతాలో రూ.114.18 కోట్లు, అతని భార్య మేడా భానుప్రియకు చెందిన రెండు ఖాతాల్లో రూ.45.62 కోట్లు, మనోజ్ బామ్మర్ది మేడా సతీష్ ఖాతాలో రూ.135.48 కోట్లు ఉన్నట్లు గుర్తించారు. అలాగే బొమ్మిడాల నాగలక్ష్మి ఖాతాలో రూ.81.72 కోట్లు, కరీంనగర్‌కు చెందిన తాటికొండ రాజుకు చెందిన నరసింహా కిరాణం అండ్ డెయిరీ ఖాతాలో రూ.92.54 కోట్లు, మరో ప్రధాన నిందితుడు ఉడతనేని వికాస్ చౌదరి ఖాతాలో రూ.80.41 కోట్ల భారీ లావాదేవీలు జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు.

నిరుద్యోగుల ఖాతాలే పెట్టుబడిగా..

ఈ ముఠా అనుసరించిన మోసపూరిత విధానం అత్యంత ప్రమాదకరంగా ఉంది. నిందితులు మొదట సత్తుపల్లి (Sathupalli) పరిసర ప్రాంతాల్లోని నిరుద్యోగ యువకులకు ఉద్యోగాల ఆశ చూపి వారిని పిలిపించుకునేవారు. అనంతరం వారితో ప్రముఖ బ్యాంకుల్లో ఖాతాలు తెరిపించి, ఆ ఖాతాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని తమ ఆధీనంలోకి తీసుకునేవారు. ఆ ఖాతాలనే సైబర్ నేరాల ద్వారా వచ్చిన కోట్లాది రూపాయల సొత్తును దాచడానికి వినియోగించేవారు. అంతర్జాతీయ సైబర్ నేరస్థులతో సంబంధాలు కలిగి ఉన్న ఈ ముఠా, విదేశాల నుంచి కాల్ సెంటర్లు నిర్వహిస్తూ పెట్టుబడులు, మ్యాట్రిమోనీ, రివార్డు పాయింట్లు, ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్, షేర్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ పేరుతో దేశవ్యాప్తంగా అమాయక పౌరులను బురిడీ కొట్టిస్తోంది. బాధితులను టెలిగ్రామ్ గ్రూపుల్లో చేర్చి, మోసపూరిత లింకుల ద్వారా వారి ఖాతాలను పూర్తిగా ఖాళీ చేస్తున్నారు.

క్రిప్టో కరెన్సీ రూపంలోకి నగదు మళ్లింపు..

నేరాల ద్వారా వచ్చిన సొమ్మును గుట్టుచప్పుడు కాకుండా మళ్లించడంలో నిందితులు ఆరితేరిపోయారు. మొదట ఏజెంట్ల ద్వారా తెరిపించిన బ్యాంక్ ఖాతాల్లోకి సొమ్మును బదిలీ చేసి, అక్కడి నుండి కొన్ని కరెంట్ ఖాతాలకు మళ్లించేవారు. చివరగా ఆ డబ్బును తమ వ్యక్తిగత ఖాతాల్లోకి చేర్చి, యూఎస్ డాలర్లు, క్రిప్టో కరెన్సీ రూపంలోకి మార్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే పోట్రు ప్రవీణ్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. నిందితులకు సహకరించిన ఇతర వ్యక్తులు, మరిన్ని బ్యాంకు ఖాతాల వివరాల కోసం క్షేత్రస్థాయిలో దర్యాప్తు కొనసాగుతోందని పోలీస్ కమిషనర్ తెలిపారు.

నేరస్థుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని, చట్ట ప్రకారం చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా యువత ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే అత్యాశతో నేరస్థుల వలలో పడి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని ఆయన సూచించారు.

Read Also: నిజామాబాద్ సమగ్ర అభివృద్ధికి నిరంతర కృషి : షబ్బీర్ అలీ

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>