కలం, వెబ్ డెస్క్: బీహార్ మాజీ ముఖ్యమంత్రి, హిందుస్తానీ అవామ్ మోర్చా (HAM) వ్యవస్థాపక అధ్యక్షుడు జితన్ రామ్ మాంఝీ (Jitan Ram Manjhi) కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీకి ఎన్డీయేలో తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. తమకు రాజ్యసభ సీటు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. లేదంటే ఎన్డీయేలో ఉండాలో లేదో పునరాలోచించుకుంటామన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఆయన బీహార్‌లో తన కుమారుడు, హామ్ జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి సంతోష్ కుమార్ సుమన్‌తోకలిసి మాట్లాడిన మాంఝీ మీడియాతో మాట్లాడారు. కూటమిలో తమకు ద్రోహం జరిగిందంటూ వ్యాఖ్యానించారు. ‘నా మంత్రిపదవి పెద్ద విషయం కాదు. కేంద్ర మంత్రివర్గంలో లేకపోయినా రాజకీయంగా నేను నిలబడగలను” అని వ్యాఖ్యానించారు. తాను ఏకైక ఎంపీగా ఉన్నప్పటికీ, హిందుస్తానీ అవామ్ మోర్చాకు రాజ్యసభలోనూ ప్రాతినిధ్యం కావాలన్నది తమ ఆకాంక్ష అని స్పష్టం చేశారు.
అనంతరం ఆయన తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించొద్దని కోరుతూ కొంత వెనక్కి తగ్గారు. “నేను పార్టీ కార్యదర్శిని కాదు, కేవలం సంరక్షకుడిని (సంఘ్రక్షక్) మాత్రమే. పార్టీ తరఫున నిర్ణయం తీసుకునే అధికారం నాకే లేదు” అని తెలిపారు. ఏప్రిల్‌లో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ రెండేసి సీట్లు, చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్)కు ఒక సీటు దక్కే అవకాశముందని మీడియాలో వస్తున్న కథనాలే తన వ్యాఖ్యలకు కారణమని మాంఝీ వివరించారు.
“2024 లోక్‌సభ ఎన్నికల ముందు మాకు రెండు లోక్‌సభ సీట్లు, ఒక రాజ్యసభ సీటు ఇస్తామని హామీ ఇచ్చారు. చివరకు మాకు ఒకే లోక్‌సభ సీటు లభించింది. రాజ్యసభ సీటు హామీ ఇంకా నెరవేరలేదు. అదే విషయాన్ని పార్టీ కార్యకర్తల దృష్టికి తీసుకువచ్చాను” అని అన్నారు. మాంఝీ 2015లో హామ్ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే.

Read Also: కేంద్ర ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. త్వరలో డీఏ 63 శాతం!
Follow Us On : WhatsApp


