epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

మేడారం భక్తులకు ఆరోగ్య భరోసా: మంత్రి రాజనర్సింహ కీలక ఆదేశాలు

కలం వెబ్​ డెస్క్​ : వనదేవతల దర్శనానికి వచ్చే కోట్లాది మంది భక్తుల ఆరోగ్యంపై తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. మేడారం (Medaram) వెళ్లే ప్రతి అడుగులోనూ భక్తులకు తోడుగా ఉండేలా వైద్యారోగ్య శాఖ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. దీనిపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ (Damodar Raja Narasimha) ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు.

మేడారం వెళ్లే భక్తులకు చిన్నపాటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు జాతర పరిసరాల్లో ముందస్తుగానే వైద్య శిబిరాలను ప్రారంభించారు. ఇప్పటికే గద్దెల వద్ద, జంపన్న వాగు సమీపంలో, ఆర్టీసీ బస్టాండ్ వద్ద శిబిరాలు అందుబాటులోకి వచ్చాయి. భక్తుల సంఖ్య పెరిగే కొద్దీ మరిన్ని క్యాంపులు ఏర్పాటు చేయాలని మంత్రి స్పష్టం చేశారు. భక్తులు తమ ఇళ్ల నుంచి బయలుదేరినప్పటి నుండి తిరిగి క్షేమంగా చేరుకునే వరకు అన్ని దారుల్లోనూ వైద్య సేవలు అందుబాటులో ఉండాలని ఆయన ఆదేశించారు.

అత్యవసర చికిత్స కోసం మేడారంలోని టీటీడీ కల్యాణ మండపంలో 50 పడకలతో శ్రీ సమ్మక్క సారలమ్మ వైద్యశాలను సిద్ధం చేశారు. దీనితో పాటు జంపన్న వాగు, ఇంగ్లీష్ మీడియం స్కూల్ వద్ద ఆరు పడకల సామర్థ్యంతో రెండు మినీ ఆసుపత్రులను ఏర్పాటు చేశారు. జాతర పరిసర ప్రాంతాల్లో మొత్తం 30 మెడికల్ క్యాంపులు భక్తులకు సేవలు అందించనున్నాయి.

వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చే భక్తుల కోసం 8 ప్రధాన మార్గాల్లో 42 ఎన్-రూట్ మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా హనుమకొండ – మేడారం (Medaram) మార్గంలో 9 క్యాంపులు, ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చే వారి కోసం 6, భద్రాచలం రూట్‌లో 5 క్యాంపులు ఏర్పాటు చేసి ఎక్కడా వైద్య సేవలకు లోటు రాకుండా చూస్తున్నారు.

ఈసారి జాతర కోసం భారీ స్థాయిలో సిబ్బందిని మోహరించారు. మొత్తం 3,199 మంది సిబ్బంది విధుల్లో ఉంటారు. వీరిలో 72 మంది స్పెషలిస్టులు, 42 మంది లేడీ డాక్టర్లతో కలిపి మొత్తం 544 మంది వైద్యులు అందుబాటులో ఉంటారు. అలాగే 2,150 మంది పారామెడికల్ సిబ్బంది షిఫ్టుల వారీగా 24 గంటల పాటు నిరంతరాయంగా సేవలు అందిస్తారు.

ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి గోల్డెన్ అవర్ లో చికిత్స అందించడానికి 35 అంబులెన్సులను సిద్ధం చేశారు. తీవ్రమైన సమస్యలు ఉంటే ములుగు, వరంగల్ ఎంజీఎం ఆసుపత్రులకు తరలించేలా ఏర్పాట్లు చేశారు. 248 రకాల మందులు, పాముకాటు విరుగుడు ఇంజెక్షన్లు, సర్జికల్ సామాగ్రిని తగినంత నిల్వ ఉంచారు. జనవరి 25వ తేదీ నుంచి అన్ని శిబిరాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయి. మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాల మేరకు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రవీందర్ నాయక్ క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

Read Also: జిల్లాకు ఆధ్యాత్మిక వైభవం.. నాలుగు పుణ్యక్షేత్రాలతో టెంపుల్ సిటీ కారిడార్ !

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>