కలం వెబ్ డెస్క్: అమెరికా వీసా(US Visa) కోసం ప్రయత్నిస్తున్న ఉద్యోగులు, విద్యార్థులకు ఆ దేశం మరో బ్యాడ్ న్యూస్ చెప్పింది. హెచ్-1బీ సహా పలు వీసాల ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజులను పెంచుతున్నట్లు అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం (USCIS) ప్రకటించింది. ఈ కొత్త ఫీజులు మార్చి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకొని ఈ ఫీజులను పెంచినట్లు USCIS తెలిపింది. జూన్ 2023 నుంచి జూన్ 2025 మధ్య పెరిగిన ఖర్చులకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కొత్త నిబంధనల ప్రకారం, హెచ్-1బీ, ఎల్-1, ఓ-1, పీ-1, టీఎన్ వీసాల వంటి ఫారమ్ I-129 కేటగిరీలకు సంబంధించిన ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజు ఇప్పటి వరకు ఉన్న 2,805 డాలర్ల నుంచి 2,965 డాలర్లకు పెరుగుతుంది. అలాగే హెచ్-2బీ, ఆర్-1 వీసాలకు ఈ ఫీజు 1,685 డాలర్ల నుంచి 1,780 డాలర్లకు పెరుగనుంది. ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డులకు సంబంధించిన ఫారమ్ I-140 పిటిషన్ల ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజు కూడా 2,805 డాలర్ల నుంచి 2,965 డాలర్లకు పెరుగుతుంది.
విద్యార్థులు, ఎక్స్చేంజ్ విజిటర్లకు సంబంధించిన కొన్ని దరఖాస్తులపై కూడా ఫీజులు పెరుగుతున్నాయి. ఫారమ్ I-539 కింద వచ్చే ఎఫ్-1, ఎఫ్-2 విద్యార్థులు, జే-1, జే-2 ఎక్స్చేంజ్ విజిటర్లు, ఎం-1, ఎం-2 వృత్తి విద్యార్థుల ప్రీమియం ఫీజు 1,965 డాలర్ల నుంచి 2,075 డాలర్లకు పెరుగుతుంది. అలాగే ఉద్యోగ అనుమతి కోసం దరఖాస్తు చేసే వారికి (ఫారమ్ I-765) ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజు 1,685 డాలర్ల నుంచి 1,780 డాలర్లకు పెరుగనుంది. ఇందులో OPT, STEM-OPT విద్యార్థులు కూడా ఉన్నారు.
ఈ ఫీజుల పెంపు వల్ల వచ్చే ఆదాయాన్ని ప్రాసెసింగ్ వేగం పెంచేందుకు, పెండింగ్ కేసులను తగ్గించేందుకు, USCIS సేవలను మెరుగుపరచేందుకు ఉపయోగిస్తామని అధికారులు తెలిపారు. ఈ మార్పుల ప్రభావం ముఖ్యంగా భారతీయ నిపుణులు, విద్యార్థులు, కంపెనీలపై ఎక్కువగా పడనుంది. అమెరికాలో హెచ్-1బీ వీసాలు (US Visa), ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డులు, OPTలను ఎక్కువగా వినియోగించేది భారతీయులే కావడంతో ఈ నిర్ణయం భారతీయులపై ప్రభావం చూపనుంది.
Read Also: శబరిమల బంగారం చోరీలో కీలక ట్విస్ట్‌లు!
Follow Us On : Twitter


