కలం డెస్క్: కవిత (Kavitha) ఇష్యూ బీఆర్ఎస్ పెద్దలకు సంకటంగా మారింది. ఆమె చేస్తున్న ఆరోపణలపై ఇటు నోరు విప్పలేక.. అటు నోరు మూసుకోలేక.. తలలు పట్టుకుంటున్నారు. స్పందిస్తే ఒక బాధ.. స్పందిచకపోతే ఇంకో బాధ అన్నట్లుగా కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు పరిస్థితి తయారైంది. నేరుగా తమ నియోజకవర్గాల్లోనే అవినీతి జరిగినట్లు శాసనమండలి వేదికగా కవిత ఆరోపణలు చేసినా.. వాటికి సిరిసిల్ల ఎమ్మెల్యేగా కేటీఆర్ గానీ, సిద్దిపేట ఎమ్మెల్యేగా హరీశ్ రావు గానీ కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు. ఈ పరిస్థితి చూసి.. బీఆర్ఎస్ నేతలే కాకుండా ఆయా నియోజకవర్గాల్లోని కేటీఆర్, హరీశ్ రావు అభిమానులు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
కవిత ఇష్యూ ప్రత్యర్థులకు అస్త్రంగా మారుతున్నదని.. ఆరోపణలకు కౌంటర్ ఇవ్వకపోతే అవినీతిని అంగీకరించినట్లేనన్న సంకేతాలు ప్రజల్లోకి బలంగా వెళ్తాయని గులాబీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ చీఫ్ కేసీఆరే రంగంలోకి దిగి.. ఏదో ఒకటి తేల్చాలని, ఆయన మౌనం ఇప్పటికే పార్టీకి నష్టాన్ని చేకూర్చిందని, ఇట్లనే ఉంటే మరింత డ్యామేజీ తప్పదని భావిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఆ ఎఫెక్ట్ కనిపించిందని.. త్వరలో మున్సిపల్ ఎన్నికలు కూడా జరగనుండటంతో ఇప్పటికైనా సెట్ రైట్ చేయాలని కోరుతున్నారు.
తీవ్ర ఆరోపణలు
బీఆర్ఎస్ లోని కీలక నేతలు కేటీఆర్, హరీశ్ రావు టార్గెట్ గా కవిత (Kavitha ) చాలా సందర్భాల్లో తీవ్ర ఆరోపణలు చేశారు. తన తండ్రి, పార్టీ చీఫ్ కేసీఆర్ దేవుడంటూనే ఆయన చుట్టూ దయ్యాలు చేరాయని, పార్టీని నాశనం చేస్తున్నాయని మొదట్లోనే విమర్శలు ఎక్కుపెట్టారు. ఆ తర్వాత పార్టీ నుంచి వేటుకు గురయ్యాక.. ఆరోపణలకు ఇంకింత పదును పెట్టారు. కాళేశ్వరం మొదలు.. సెక్రటేరియెట్, అమరవీరుల జ్యోతి, జిల్లా కలెక్టరేట్ల నిర్మాణం వరకు అన్నిట్లో అవినీతి జరిగిందని.. దీని వెనుక కొన్ని శక్తులు ఉండి కేసీఆర్ ను తప్పుదోవ పట్టించి పబ్బంగడుపుకున్నాయని మండిపడ్డారు. కేటీఆర్ ఎమ్మెల్యేగా ఉన్న సిరిసిల్ల, హరీశ్ రావు ఎమ్మెల్యేగా ఉన్న సిద్దిపేటలోని కలెక్టరేట్ల నిర్మాణంలోనూ అవినీతి మరక ఉందని.. అందుకే అవి కట్టిన తర్వాత మొదటివానకే నీట మునిగాయని అన్నారు.
పదేండ్లు తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకోలేదని తెలిపారు. కాళేశ్వరంపై పెట్టిన శ్రద్ధను పాలమూరు ప్రాజెక్టుపై పెట్టలేదని, దీని వెనుక నాటి ఇరిగేషన్ మంత్రి కమీషన్ల దాహం ఉందని కవిత ఆరోపించారు. గత బీఆర్ఎస్ హయాంలో లక్షా 89వేల కోట్లు సాగునీటి ప్రాజెక్టుల కోసం ఖర్చు చేసినా 14 లక్షల కొత్త ఆయకట్టుకు కూడా నీళ్లివ్వలేదని మండిపడ్డారు. ఇవన్నీ నేరుగా నాడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా కొనసాగిన హరీశ్ రావుతోపాటు నాడు సీఎం హోదాలో ఉన్న కేసీఆర్ టార్గెట్ గా చేసిన ఆరోపణలే! ఇప్పటికే వీటిపై కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు బీఆర్ఎస్ ను కార్నర్ చేస్తున్నాయి. ఇప్పుడు సొంత ఆడబిడ్డ కూడా ఆరోపణలు చేయడంతో గులాబీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.
మౌనం ఎందుకు?
బీఆర్ఎస్ టార్గెట్ గా కవిత చేస్తున్న ఆరోపణలు స్టేట్ పాలిటిక్స్ ను హీటెక్కిస్తున్నాయి. పదేండ్లు ఆమె కూడా బీఆర్ఎస్ పాలనలో ఉన్నప్పటికీ.. ఇప్పుడు బయటికి వచ్చి మాట్లాడుతుండటంపై కొందరు పెదవి విరుస్తున్నా.. బీఆర్ఎస్ బాధితులు మాత్రం కవిత మాటలకు పరోక్షంగా మద్దతిస్తున్నారు. ఇప్పటికైనా తప్పులను ఆమె ఒప్పుకుంటున్నారని.. వాటికి కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు ఏం సమాధానం చెప్తారని వారు ప్రశ్నిస్తున్నారు. అయితే.. ఆ ముగ్గురి నుంచి మాత్రం మౌనమే సమాధానం అవుతున్నది. పార్టీలో కోవర్టులు ఉన్నారని మొదట్లో కవిత చేసిన ఆరోపణలకు మీడియా ముందు.. ‘ఔను ఉండొచ్చు’ అని మాత్రమే బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ఆ తర్వాత నుంచి ఆయన నుంచి నో రెస్పాన్స్ ! ఆ మధ్య ఫామ్ హౌస్ వీడి తెలంగాణ భవన్ కు వచ్చిన కేసీఆర్ (KCR) ను కూడా.. కవిత ఇష్యూపై మీడియా ప్రశ్నించగా, మున్ముందు మస్తు మాట్లాడేదుందని, అప్పుడు మీ ప్రశ్నలకు సమాధానం చెప్తానంటూ ఆయన తప్పించుకున్నారు. హరీశ్ రావుదీ ఇదే పరిస్థితి!! అయితే.. ఈ ముగ్గురు మాత్రం మాట్లాడకపోవడం వెనుక ‘ఆడబిడ్డ’ సెంటిమెంట్ వినిపిస్తున్నది. తన కూతురు కావడంతో కవిత వ్యాఖ్యలపై కేసీఆర్ మాట్లాడలేని పరిస్థితి.. చెల్లెలు కావడంతో కేటీఆర్ దీ సేమ్ సిట్యువేషన్ ! మేనమామ బిడ్డ కావడంతో హరీశ్ రావు కూడా నోరు మెదపలేని పరిస్థితి!! ఇప్పటికే సొంత ఆడబిడ్డనే ఆస్తి కోసం ఇంట్లో నుంచి వెళ్లగొట్టినవాళ్లు, మిగతా ఆడబిడ్డలకు ఏం చేస్తారంటూ సీఎం రేవంత్ సహా ప్రత్యర్థి పార్టీలు దుయ్యబడ్తున్నాయి.
ఇలాంటి టైమ్ లో కవిత ఆరోపణలకు స్పందిస్తే.. ఇంకింత తిప్పలు తప్పవని ఆ ముగ్గురు మౌనం దాల్చినట్లు తెలుస్తున్నది. ‘మాట్లాడినన్ని రోజులు మాట్లాడుకోని చూద్దాం.. కవిత ఇష్యూలోకి మనం వెళ్లొద్దు’ అనే ధోరణిలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ ఉన్నట్లు బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. అవసరమైతే మాధవరం కృష్ణా రావు, సింగిడి నిరంజన్ రెడ్డి, జగదీశ్ రెడ్డి వంటి కొందరిని అప్పుడప్పుడు మాట్లాడనిద్దామన్న ఆలోచనలో ఆ ముగ్గురు ఉన్నట్లు చెప్తున్నాయి.
మాట్లాడకపోతే మున్సి‘పోల్స్’ లో ముప్పే !
కవిత ఇష్యూలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ త్రయం మౌనంగా ఉండటం అంటే.. పార్టీకి నష్టం చేకూర్చినట్లేనని బీఆర్ఎస్ కేడర్ కలవరపడ్తున్నది. రోజు రోజుకు ఆమె ఆరోపణలు ప్రజల్లోకి వెళ్తున్నాయని.. ప్రత్యర్థులకు అస్త్రంగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం మొదలు.. క్రమంగా పార్టీ గ్రాఫ్ పడిపోతున్నదని, కవిత (Kavitha) ఆరోపణలతో ఇది ఇంకా దిగజారొచ్చని అంటున్నారు. జూబ్లీహిల్స్ బై పోల్, పంచాయతీ ఎన్నికల్లో ఇది స్పష్టంగా కనిపించిందని.. ఇలాంటి పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలని గులాబీ ముఖ్య నేతల వద్ద జిల్లాల్లోని కింది స్థాయి లీడర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Also: ఫుల్‌టైమ్ డీజీపీ నియామకంలో చిక్కులు
Follow Us On: Youtube


