కలం డెస్క్ : రాష్ట్రానికి పూర్తి స్థాయి డీజీపీని (Telangana DGP) నియమించడంపై కసరత్తు మొదలుపెట్టిన ప్రభుత్వానికి వరుస చిక్కులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే రెండుసార్లు పంపిన జాబితాలు కొన్ని కొర్రీలతో తిరిగొచ్చాయి. తాజాగా మూడోసారి పంపిన జాబితా కూడా రిటర్న్ అయింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన జాబితాలోని పేర్లపై యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) కొన్ని సందేహాలను లేవనెత్తింది. ప్రభుత్వం పంపిన జాబితాలో ప్రస్తుతం డీజీపీగా ఉన్న శివధర్‌రెడ్డి పేరుతో పాటు ఆ పోస్టుకు అర్హులైన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు సీవీ ఆనంద్, వినయ్ ప్రభాకర్ ఆప్టే, సౌమ్యా మిశ్రా, షికా గోయల్ పేర్లు ఉన్నాయి. ఈ జాబితాను పరిశీలించిన యూపీఎస్సీ కొందరి ఎంపిక విషయంలో సుప్రీంకోర్టు అనుమతి కావాలంటూ ఆ జాబితాను తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికే పంపింది.
తగినంత సర్వీస్ లేకపోవడమేనా?.. :
సుప్రీంకోర్టు గతంలో వెలువరించిన ఉత్తర్వుల్లోగానీ, డీవోపీటీ నిబంధనల్లోగానీ పూర్తిస్థాయి డీజీపీగా నియమించాలనుకున్న అధికారికి కనీసంగా ఆరు నెలల సర్వీసు ఉండాలన్నది ఒక షరతు. కానీ శివధర్ రెడ్డి పదవీకాలం ఈ ఏడాది ఏప్రిల్ చివరకు ముగియనున్నందున ఆయన విషయంలో యూపీఎస్సీ కొర్రీలు పెట్టింది. జాబితాను ఆలస్యంగా పంపినందువల్ల సుప్రీంకోర్టు నుంచి అనుమతి కావాలని రాష్ట్ర ప్రభుత్వానికి వివరించింది. తొమ్మిది నెలల క్రితం ఒకసారి, గత నెల 31న మరోసారి పంపింది. క్లారిఫికేషన్ పేరుతో యూపీఎస్సీ దగ్గరే జాప్యం జరుగుతున్నదనేది రాష్ట్ర ప్రభుత్వ వాదన. ఇదే సమయంలో డీజీపీగా శివధర్‌రెడ్డి నియామకాన్ని సవాలు చేస్తూ ధనగోపాల్ అనే వ్యక్త హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఈ నెల 9న విచారణ జరగనున్నది. అటు యూపీఎస్సీ, ఇటు హైకోర్టు విచారణ అనంతరం పూర్తిస్థాయి డీజీపీ (Telangana DGP) నియామకంపై స్పష్టత రానున్నది.
Read Also: బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు టాస్క్.. నెగ్గుతారా..?
Follow Us On : WhatsApp


