కలం డెస్క్: కల్వకుంట్ల కవిత రాజీనామాతో ఖాళీ అయిన నిజామాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక (Nizamabad MLC ByPoll) వస్తుందా? ఈసీ నిబంధన ప్రకారం.. ఆరునెలల్లోపు బైపోల్ నిర్వహిస్తారా? ప్రస్తుత పరిస్థితి చూస్తే ఇప్పుడప్పుడే ఎన్నిక జరిగే అవకాశమే కనిపించడం లేదు. ఇందుకు ఆ స్థానంలో ఓటర్లు లేకపోవడమే ప్రధాన కారణం! ఓటర్లు లేకపోవడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా..?! ఔను..!!
ఆ ఎన్నికలు పూర్తయితేనే..!
లోకల్బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటువేసిది ఆ స్థానం పరిధిలోని ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో మెంబర్లు (స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు). నిజామాబాద్ ఎమ్మెల్సీ స్థానంలో దాదాపు 824 ఓట్లు ఉన్నాయి. ఇందులో కీలకమైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్, కార్పొరేటర్లే 90శాతం వరకు ఉంటారు. అయితే.. వీరందరి పదవీకాలం ఇప్పటికే ముగియడంతో వీళ్లెవరికీ ఓటు హక్కు లేదు. దీంతో ఎమ్మెల్సీ స్థానానికి ఇప్పుడప్పుడే బైపోల్ (Nizamabad MLC ByPoll) జరగడం కష్టం. ఆ ఉప ఎన్నిక నిర్వహించాలంటే ముందుగా స్థానిక సంస్థలకు ప్రభుత్వం ఎలక్షన్స్ నిర్వహించాల్సి ఉంటుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు జరిగిన తర్వాతే నిజామాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక వస్తుంది.
ఈసీ నిబంధన ఏం చెబుతుంది?
ఏదైనా ఓ స్థానం (ఎమ్మెల్సీ/ఎమ్మెల్యే/ఎంపీ) ఖాళీ అయితే ఆరు నెలల్లోపు ఉప ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నిబంధనల్లో ఉంది. ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రం దాన్ని పొడిగిస్తారు. హోల్డ్లో పెడ్తారు. నిజామాబాద్ ఎమ్మెల్సీ సీటుకు ఓటర్లు లేకపోవడాన్ని ఈసీ ప్రత్యేక పరిస్థితిగా, అనివార్యకారణాలు (Due to lack of Electoral college)గా పరిగణించి హోల్డ్లో పెట్టొచ్చని అధికారులు అంటున్నారు. గతంలోఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటకలోనూ ఇలాంటి సంఘటనలు ఎదురయ్యాయని గుర్తుచేస్తున్నారు.
రెండేండ్ల పదవీ కాలం ఉండగానే..!
2022 జనవరిలో జరిగిన నిజామాబాద్ లోకల్బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కవిత (Kavitha) భారీ మెజారిటీతో గెలిచారు. పదవీ కాలం ఆరేండ్లు (2028 జనవరి). కానీ, ఇటీవల బీఆర్ఎస్ తో తెగతెంపులు చేసుకోవడంతో ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేశారు. రాజీనామాను మండలి చైర్మన్ కూడా ఆమోదించారు. ఇంకా రెండేండ్ల పదవీ కాలం ఉండగానే కవిత రిజైన్ చేయడంతో ఉప ఎన్నిక నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఓటర్లు లేకపోవడంతో ఇప్పట్లో బైపోల్ జరిగే అవకాశం లేదు.
Read Also: అసెంబ్లీకి బీఆర్ఎస్ పర్మినెంట్ గుడ్‌బై?
Follow Us On: Youtube


