కలం డెస్క్: బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నేత కావడంతో ఆయన బాటలోనే ఆ పార్టీ ఎమ్మెల్యేలు నడవాలనుకుంటున్నారా?.. ఆయన తరహాలోనే సంతకాలు పెట్టి వెళ్ళిపోవాలన్న ఆలోచన ఉన్నదా?.. అన్ని సెషన్లకూ ఇదే ఫార్ములాను కొనసాగించాలని అనుకుంటున్నారా?.. తాజా సెషన్ మొత్తాన్ని బాయ్‌కాట్ చేసిన బీఆర్ఎస్ (BRS Boycott Assembly).. రానున్న మూడేండ్లూ ఇలాగే వ్యవహరించాలనుకుంటున్నదా?.. ఇలాంటి కొన్ని ప్రశ్నలకు ఆ పార్టీ నేతల నుంచి దాదాపుగా ఔననే సమాధానమే వస్తున్నది. ఎలాగూ స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ప్రతిపక్షం వైపే చూడడం లేదని, మాట్లాడే ప్రయత్నం చేస్తే మైక్ కట్ చేస్తున్నారని ఆరోపిస్తున్న నేపథ్యంలో అన్ని సెషన్లలోనూ ఇలాంటి సీన్ రిపీట్ అవుతుందన్నది వారి వాదన. మాట్లాడే అవకాశం లేనప్పుడు హాజరై ప్రయోజనం ఏంటని ఎదురు ప్రశ్నిస్తున్నారు.
అసహనంలో గులాబీ ఎమ్మెల్యేలు :
నీళ్ల అంశంలో అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని కడిగేస్తామని తాజా అసెంబ్లీ ప్రారంభానికి ముందు బీఆర్ఎస్ పెద్దలు గంభీర ప్రకటనలు చేశారు. కానీ వారి ఆచరణ అందుకు విరుద్ధంగానే జరిగింది. అసెంబ్లీ సమావేశాలు మొదలైన రెండు రోజులకే బహిష్కరిస్తున్నామంటూ వెళ్లిపోయారు. ఈ బహిష్కరణ ఈ సెషన్‌కు మాత్రమే కాదని, రాబోయే మూడేండ్లు ఇట్లనే ఉంటుందని ఆ పార్టీ నేతలు చిరునవ్వులతో స్పందిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఉన్నప్పటికీ బీఆర్ఎస్ అసెంబ్లీలో గొంతు వినిపించకపోవడం చర్చనీయాంశమైంది. ప్రజల సమస్యలను సభలో ప్రస్తావించి ప్రభుత్వాన్ని నిలదీయడానికి బదులు వాకౌట్లతో కాలం వెళ్ళదీస్తున్నది. బాయ్‌కాట్ నిర్ణయం పట్ల ఆ పార్టీ కేడర్ సైతం విస్మయం వ్యక్తం చేసింది. ప్రభుత్వాన్ని కడిగేయడానికి, ఒత్తిడి పెంచడానికి చట్టసభలను వినియోగించుకోడానికి బదులు మీడియా సమావేశాలను వాడుకోవడం వల్ల ప్రయోజనం లేదన్నది వారి భావన.
బడ్జెట్ సెషన్‌కు హాజరుపై చర్చలు :
అధికార పార్టీ తమ గొంతు నొక్కుతున్నదని, ఇష్టానుసారంగా కాంగ్రెస్ నేతలు తమపై నోరుపారేసుకుంటున్నారని, అందుకే బహిష్కరిస్తున్నట్లు బీఆర్ఎస్ పెద్దలు చేస్తున్న వాదన. దాదాపు తొమ్మిది నెలల గ్యాప్ తర్వాత డిసెంబర్ 29న అసెంబ్లీకి కేసీఆర్ వచ్చి మూడు నిమిషాలు మాత్రమే ఉండిపోయారు. ఆ తర్వాత సభ సిట్టింగ్ రోజు (జనవరి 2) పక్కాగా ఆయన వస్తారని, నందినగర్‌లోని ఇంట్లోనే ఉన్నారని, నీళ్లపై ప్రభుత్వాన్ని నిలదీస్తారని బీఆర్ఎస్ నేతలు లీకులు ఇచ్చారు. తీరా చూస్తే.. ఆయన రాకపోవడంతో పాటు మొత్తం అసెంబ్లీ సెషన్‌నే బీఆర్ఎస్ బాయ్‌కాట్ (BRS Boycott Assembly) చేసింది. వచ్చే నెల చివర్లో రాష్ట్ర బడ్జెట్ సెషన్ ఉన్నందున ఆ సమావేశాలకైనా బీఆర్ఎస్ హాజరవుతుందా?.. లేక తొలి రోజు గవర్నర్ ప్రసంగానికి వచ్చి అక్కడితోనే సరిపెట్టుకుంటుందా?.. బడ్జెట్‌పై చర్చలోగానీ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపైగానీ మాట్లాడకుండా బహిష్కరణ అస్త్రాన్ని ఎంచుకుంటుందా?.. నిబంధనల ప్రకారం అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకం చేయడానికి మాత్రమే పరిమితమవుతారా?.. ఇలాంటి చర్చలు మొదలయ్యాయి.
Read Also: వెండికి కూడా హాల్ మార్కింగ్..! కేంద్రం నయా ప్లాన్
Follow Us On: Youtube


