కలం, వెబ్ డెస్క్ : స్విట్జర్లాండ్‌లోని దావోస్ (Davos) వేదికగా జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమ్మిట్‌లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (America President Donald Trump), తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) భేటీ కోసం సన్నాహాలు మొదలయ్యాయి. అమెరికా చరిత్రలోనే తొలిసారిగా ఒక సిట్టింగ్ అధ్యక్షుడి హోదాలో గ్లోబలైజేషన్, స్వేచ్ఛా వాణిజ్యం నినాదాలతో 2000వ సంవత్సరంలో బిల్ క్లింటన్ హాజరయ్యారు. ఆ తర్వాత 2018, 2020 సంవత్సరాల్లో డోనాల్డ్ ట్రంప్ హాజరై ‘అమెరికా ఫస్ట్’ అనే స్లోగన్ ఇచ్చారు. గతేడాది సమ్మిట్‌కు ఆయన వర్చువల్‌గా హాజరయ్యారు. ఈసారి ప్రత్యక్షంగా పాల్గొంటారని వైట్ హౌస్ వర్గాలు ప్రకటించాయి. ఈ నెల 20 లేదా 21 తేదీల్లో ట్రంప్ హాజరు కానున్నారు. ఆ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యేందుకు సంప్రదింపులు జరుగుతున్నాయి.
రెండు రోజుల ముందుగానే తెలంగాణ టీమ్ :
వరల్డ్ ఎకనమిక్ ఫోరం షెడ్యూలు ప్రకారం దావోస్‌లో సమ్మిట్ ఈ నెల 19 నుంచి 23 వరకు ఐదు రోజుల పాటు జరగనున్నది. సుమారు 130 దేశాల నుంచి మూడు వేల మంది ప్రతినిధులు, పలు కంపెనీల సీఈఓలు, పారిశ్రామికవేత్తలు, వాణిజ్యవేత్తలు హాజరవుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం 2018 నుంచి ప్రతి ఏటా ఈ సమ్మిట్‌లో పాల్గొంటున్నది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) కి ఇది మూడవసారి. ట్రంప్‌తో సీఎం భేటీ కోసం తెలంగాణ డెలిగేషన్ రెండు మూడు రోజుల ముందుగానే దావోస్ వెళ్తున్నది. అటు వైట్ హౌజ్ అధికారులతో సంప్రదింపులు జరుపుతూనే ఇటు దావోస్‌లో సైతం ఆ దేశ ప్రతినిధి బృందంతో మాట్లాడనున్నది. రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు ఫలిస్తే ట్రంప్, సీఎం రేవంత్ మధ్య సమావేశం సాకారమవుతుంది. అమెరికా కంపెనీలు హైదరాబాద్‌ను వ్యాపార కేంద్రంగా ఎంచుకోవడంతో ట్రంప్, సీఎం రేవంత్ మధ్య భేటీ జరగవచ్చని ప్రాథమిక సమాచారం.
ఈ నెల 19న దావోస్‌కు సీఎం రేవంత్ :
వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమ్మిట్ కోసం రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి, పలువురు అధికారులు ఈ నెల 17న హైదరాబాద్ నుంచి బయలుదేరనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహా మరో అధికారుల బృందం ఈ నెల 19న బయలుదేరి వెళ్తుంది. వివిధ కంపెనీల సీఈఓలతో తెలంగాణ డెలిగేషన్ సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరనున్నది. కొన్ని కంపెనీలతో అవగాహనా ఒప్పందాలూ జరగనున్నాయి. గతంలోని రెండు విజిట్‌లలో సుమారు 2.09 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు కుదిరాయి. ఈసారి ట్రంప్‌తో భేటీ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నది. వైట్ కార్డ్ అతిథులుగా రేవంత్, శ్రీధర్‌బాబులు డొనాల్డ్ ట్రంప్‌ను కలిసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. తెలంగాణ డెలిగేషన్‌లో జర్నలిస్టులు కర్రి శ్రీరామ్, సీఎం పీఆర్వో అన్వేష్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు ఉంటారు. దావోస్ టూర్ తర్వాత సీఎం రేవంత్ ఆరు రోజుల పాటు అమెరికా పర్యటనకు వెళ్తారు. ఫిబ్రవరి 1 వ తేదీన రాష్ట్రానికి చేరుకుంటారు.
Read Also: ‘వర్సిటీ భూమి ప్రభుత్వానిది కాదు’.. MANUU స్టూడెంట్స్ ప్రొటెస్ట్
Follow Us On: Twitter


