కలం, వెబ్ డెస్క్: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లనున్న ప్రయాణికుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) సిద్ధమైంది. ఈ పండుగకు 6431 ప్రత్యేక బస్సులను నడపాలని యాజమాన్యం నిర్ణయించింది. ప్రధానంగా ఈ నెల 9, 10, 12, 13 తేదీల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆయా రోజుల్లో రద్దీ మేరకు ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచేలా ప్లాన్ చేసింది. అలాగే ఈ నెల 18, 19 తేదీల్లో తిరుగు ప్రయాణానికి కూడా తగిన ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్లో రద్దీ ప్రాంతాలైన ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరాంఘర్, ఎల్బీనగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్బీ, బోయినపల్లి, గచ్చిబౌలి తదితర ప్రాంతాల నుంచి బస్సులను నడుపనుంది. ఈ మేరకు షామియానాలు, కుర్చీలు, పబ్లిక్ అడ్రస్ సిస్టం, తాగునీటి సదుపాయం, మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేయనుంది.
ప్రధాన పండుగులు (Festivals), ప్రత్యేక సందర్భాల్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా స్పెషల్ సర్వీసులను నడుపుతోంది. ఆ స్పెషల్ బస్సులకు అయ్యే కనీస డీజిల్ ఖర్చులు, నిర్వహణ మేరకు టికెట్ ధరను సవరించుకోవాలని 2003లో జీవో నంబర్ 16ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో నడిచే స్పెషల్ బస్సుల్లో మాత్రమే 1.5 వరకు టికెట్ ధరలను సవరించుకునే వెసులుబాటును కల్పించింది.
రాష్ట్ర ప్రభుత్వ మహాలక్ష్మి పథకంలో భాగంగా సంక్రాంతికి నడిపే పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరి, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో (Buses) మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం యథావిధిగా అమల్లో ఉంటుంది. టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ను www.tgsrtcbus.in వెబ్ సైట్లో బుక్ చేసుకోవాలని యాజమాన్యం తెలిపింది. సంక్రాంతి ప్రత్యేక బస్సులకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని TGSRTC సూచించింది.
Read Also: ఈ నెల 18న మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి: సీతక్క
Follow Us On : WhatsApp


