epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

కవితతో కలిసొచ్చేదెవరు?

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ శాసనమండలి వేదికగా కన్నీళ్ళు పెట్టుకున్న కవిత (Kavitha) కు ఓట్లు రాలుతాయా?.. ఆడబిడ్డ కంటతడి అనే సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా?.. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడేండ్లు ఉండడంతో కొత్త పార్టీకి స్పేస్ దొరుకుతుందా?.. ఇప్పటిదాకా కేసీఆర్ కూతురిగా పరిచయమైన ఆమె ఇకపైన సొంత పార్టీ పెట్టుకుంటే ప్రజల ఆదరణ లభిస్తుందా?.. ఏ సెక్షన్ ప్రజలు ఆమెను ఆదరిస్తారు?.. ఆమె కొత్త పార్టీతో ఏ పార్టీ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది?.. ఇవీ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న చర్చలు. ఇతర పార్టీల నుంచి చేరే నేతలెవరు?.. ఆమె వెంట నడిచేది ఏ సెక్షన్ ప్రజలు?.. ఇలాంటి ప్రశ్నలపై ఆమె అభిమానులు సైలెంట్‌గా ఉన్నారు. బీఆర్ఎస్ ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసినా కవిత మాత్రం స్వచ్ఛందంగా తానే రాజీనామా చేసినట్లు ప్రకటించుకోవడం గమనార్హం.

కవితమ్మ శపథం ఫలిస్తుందా? :

కౌన్సిల్ వేదికగా కంటతడితో ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి. ‘‘బీఆర్ఎస్ నుంచి తెగతెంపులు చేస్కున్న.. ఆ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్న.. సభ నుంచి ఇప్పుడు వ్యక్తిగా వెళ్తున్న.. భవిష్యత్తులో శక్తిగా వస్త..” అంటూ శపథం చేశారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలోని తప్పులను తూర్పారబట్టారు. ఉద్యమకారులు మొదలు అంగన్వాడీ టీచర్ల దాకా అందరికీ కేసీఆర్ హయాంలో అన్యాయం జరిగిందన్నారు. అమరవీరుల జ్యోతి నుంచి మొదలు పెడ్తే.. కలెక్టరేట్ల నిర్మాణం వరకు అవినీతి రాజ్యమేలిందని ఆరోపించారు. ఆ పార్టీ అవినీతి చిట్టాను విప్పారు. సిద్దిపేట, సిరిసిల్ల ప్రస్తావన తెచ్చి హరీశ్‌రావు, కేటీఆర్‌లపై తీవ్ర విమర్శలే చేశారు. ఇలాంటి కామెంట్ల నేపథ్యంలో ఎన్నికల యుద్ధంలో ఆమె శపథం ఏ మేరకు ఫలిస్తుందన్నది ఆసక్తికర చర్చ.

ఆమె వెంట నడిచేదెవరు?

జనంబాటే తన బాట అని తేల్చిచెప్పిన కవిత (Kavitha) వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఏ సెక్షన్‌ ప్రజలను లక్ష్యంగా పెట్టుకుంటారనేది కీలకంగా మారింది. తాజా రాజకీయ పరిస్థితుల్లో కవిత వెనుక నడిచేదెవరు?.. ఇతర పార్టీల నుంచి ఆమె పార్టీలోకి వెళ్ళేదెవరు?.. తెలంగాణ జనం అక్కున చేర్చుకుంటారా?.. ఆడబిడ్డ పశ్చాత్తాపాన్ని ప్రజలు మన్నిస్తారా?.. అంగన్‌వాడీ, సింగరేణి కార్మికుల ప్రస్తావనతో ఆ కుటుంబాలు దగ్గరవుతాయా?.. తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలు ఆదరిస్తాయా?.. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అన్యాయం జరిగినందుకు క్షమాపణ చెప్పిన కవితను విశ్వసిస్తారా?.. అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆమె రాజకీయ శక్తిగా ఎదుగుతారా?.. వచ్చే ఎన్నికల్లో ఓట్ల రూపంలో ఆమెకు పట్టం కట్టే ప్రజలెవరు?.. ఏ సెక్షన్‌ను ఆమె నమ్ముకున్నది?.. ఇవీ ఇప్పుడు బీఆర్ఎస్ సహా పలు రాజకీయ పార్టీల్లో వినిపిస్తున్న మాటలు.

పక్కా ప్రణాళికతో పార్టీ ఏర్పాటు :

దాదాపు ఇరవై ఏండ్ల పాటు బీఆర్ఎస్‌లో పనిచేసిన ఆమె ఇప్పుడు సొంత పార్టీ పెట్టుకోవాలనే పరిస్థితుల్లో పదేండ్ల కేసీఆర్ పాలనపై నిప్పులు చెరిగారు. అప్పట్లో ఆ పార్టీలో ఉండి కూడా అవినీతిని, ప్రజలకు జరిగిన అన్యాయాన్ని నివారించలేకపోయినందుకు క్షమాపణలు చెప్పారు. తెలంగాణ జాగృతి తరఫున జనం బాట పేరుతో జిల్లాల పర్యటనల్లో ఉద్యమకారులు మొదలు స్టూడెంట్ల దాకా అన్ని సెక్షన్ల ప్రజలనూ కలుస్తున్నారు. బీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యానికి గురైన వర్గాలతో భేటీ అవుతున్నారు. ఆదివాసీ గోండు గూడేలకు వెళ్తున్నారు. ప్రొఫెసర్ హరగోపాల్, వీక్షణం వేణుగోపాల్ లాంటి మేధావులను కలుస్తున్నారు. కేసీఆర్ ఒక్కడి వల్లే తెలంగాణ రాలేదని, నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు కొట్లాడితేనే వచ్చిందన్నారు. 1200 మందికిపైగా అమరులైతే 500 మందికి కూడా సాయం అందలేదన్నారు. ఒక్కో అమరుల కుటుంబానికి పది లక్షలు సాయం చేయాలని చెప్పినా కేసీఆర్ వినలేదని మండిపడ్డారు. ఇలాంటివన్నీ ప్రస్తావించి ‘సారీ’ చెప్పారు. ఈ ‘సారీ’ ఏ మేరకు వర్కవుట్ అవుతుందో కాలమే సమాధానం చెప్తుంది.

సామాజిక తెలంగాణే లక్ష్యం :

కేసీఆర్ హయాంలో గులాబీ నేతలు బంగారు తెలంగాణ నినాదాన్ని అందుకున్నారు. కానీ కవిత (Kavitha)  మాత్రం ఇప్పుడు సామాజిక తెలంగాణ స్లోగన్ ఇస్తున్నారు. రైతులకు బేడీలు వేసిన ఘటనను గుర్తుచేసి క్షమాపణలు చెప్పారు. ఉద్యమ ట్యాగ్ లైన్ ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ను బీఆర్ఎస్ గాలికి వదిలేసిందని, సాగునీటి ప్రాజెక్టుల కోసం 1.89 లక్షల కోట్లు ఖర్చు చేసినా 14 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టూ రాలేదన్నారు. ఆ నిధులతో బాగుపడ్డది కాంట్రాక్టర్లు, గులాబీ లీడర్లేనని ఆరోపించారు. ఈ క్షమాపణలతో తెలంగాణ ప్రజలు మన్నిస్తారా?.. ఉద్యమకారులు దగ్గరవుతారా?.. మేధావులు కలిసొస్తారా?.. సింగరేణి కార్మికులు, కర్షకులు అండగా నిలుస్తారా?.. సహపంక్తి భోజనాలతో విద్యార్థులు, పస్ట్ టైమ్ ఓటర్లు, యువత, ఆదివాసీ బిడ్డలు ఆదరిస్తారా?.. ఇలాంటివన్నీ చర్చను రేకెత్తిస్తున్నాయి.

నేరారోపణలు మాయమైనట్లేనా? :

బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కవిత పైనా లాబీయింగ్, పైరవీల దందా ఆరోపణలున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీబీఐ, ఈడీల ఎఫ్ఐఆర్‌లు, చార్జిషీట్‌లు, అరెస్టు, తీహార్ జైలుకెళ్ళడం.. ఇలాంటివన్నీ ఆమెను వెంటాడుతున్నాయి. ఆమె ఒక రాజకీయ శక్తిగా ఎదగడంలో ఇవి ప్రతిబంధకంగా మారుతాయా?.. ఈ మచ్చల నుంచి ఆమె బైటపడినట్లేనా?.. బీఆర్ఎస్‌ పార్టీకి చెందిన పలువురు టచ్‌లో ఉన్నారని కవిత చెప్పుకుంటున్నట్లుగా వారు ఆమెతో నడిచివస్తారా?.. డైమండ్ వాచీలు, బంగారు ఆభరణాలు, లగ్జరీ లైఫ్ స్టైల్ అనే అభిప్రాయాలు సోషల్ మీడియాలో గతంలో చక్కర్లు కొట్టిన పరిస్థితుల్లో కవిత తాజా నడవడికను చూసి దగ్గరవుతారా?.. బీఆర్ఎస్‌ హయాంలో అన్యాయానికి గురైన సెక్షన్లు తన వెంట నడిస్తే అదే శ్రీరామరక్ష అని భావిస్తున్నారా?.. ఇలాంటి చర్చలు జోరందుకున్నాయి.

Kavitha
Kavitha political future

Read Also: కల్వకుంట్ల టు దేవనపల్లి పేరు, రూటు మార్చిన కవిత

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>