పెట్రోల్‌లో ఎంత ఇథనాల్ కలుపుతున్నారు: మోదీకి రాహుల్ ప్రశ్న

కలం, వెబ్ డెస్క్ : కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌లో 20 శాతం (E20) ఇథనాల్‌ను మాత్రమే కలుపుతున్నామని ప్రకటిస్తున్నప్పటికీ, వాస్తవంలో అంతకంటే ఎక్కువ మొత్తంలో బ్లెండింగ్ జరుగుతోందని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆరోపణలు చేశారు. కర్ణాటక ప్రభుత్వ పరిధిలోని ఏడు జిల్లాల నుంచి సేకరించిన 14 పెట్రోల్ శాంపిల్స్‌ను ఒక గుర్తింపు పొందిన ల్యాబ్‌లో పరీక్షించగా, అందులోని 11 శాంపిల్స్‌లో ఇథనాల్ పరిమితి 20 శాతం దాటినట్లు తేలిందని ఆయన వెల్లడించారు. కొన్ని శాంపిల్స్‌లో ఏకంగా 31.2 శాతం, 30.5 శాతం వరకు ఇథనాల్ ఉన్నట్లు ల్యాబ్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయని రాహుల్ తెలిపారు.

ఈ అధిక బ్లెండింగ్ సమస్య ఐఓసీఎల్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు నయారా, షెల్ వంటి ప్రైవేట్ బంకుల్లో లభించే పెట్రోల్‌లోనూ కనిపిస్తోందని ఆయన (Rahul Gandhi) పేర్కొన్నారు. చమురు సంస్థలు నిర్వహించే స్వంత ల్యాబ్స్ ఈ గణాంకాలను బహిర్గతం చేయడం లేదని, వినియోగదారులు ఎంత ఇథనాల్ ఉన్న పెట్రోల్‌ను కొనుగోలు చేస్తున్నారో తెలియక నష్టపోతున్నారని విమర్శించారు.

అధిక మొత్తంలో ఇథనాల్ వల్ల వాహనాల మైలేజీ పడిపోవడమే కాకుండా ఇంజిన్ రిపేర్లు పెరిగి సాధారణ ప్రజలపై ఆర్థిక భారం పడుతోందని, అలాగే బంకుల్లో ఇథనాల్ శాతం సూచించే బోర్డులను ప్రదర్శించడం లేదని మండిపడ్డారు. ఈ క్రమంలో నిర్దేశిత E20 పరిమితిని దాటి పెట్రోల్ కలుపుతున్న కంపెనీలపై చర్యలు ఎప్పుడు తీసుకుంటారని ప్రధాని నరేంద్ర మోదీ(Modi)ని ఆయన ప్రశ్నించారు. కాగా, చమురు సంస్థలు కర్ణాటక శాంపిల్స్ పరీక్షా విధానాన్ని తీవ్రంగా ఖండించాయి.

Also Read : హర్మూజ్ జలసంధి రవాణాపై ట్రంప్ కఠిన ఆంక్షలు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>