సీబీఐ విచారణకు ఆదేశించకుంటే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు: AIFB

​కలం, కరీంనగర్ బ్యూరో: వేలాది మంది పాడి రైతుల నిరంతర శ్రమ, పాల ప్యాకెట్ల అమ్మకాల ద్వారా సమకూరిన ఆదాయంతో రూపుదిద్దుకున్న కరీంనగర్ డెయిరీ (Karimnagar Dairy) ఆస్తులను తెలంగాణ ప్రభుత్వం తక్షణమే తన స్వాధీనంలోకి తీసుకోవాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) పార్టీ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ తీవ్రస్థాయిలో డిమాండ్ చేశారు. డెయిరీ ప్రారంభమైన నాటి నుండి నేటి వరకు జరిగిన రూ.కోట్ల ఆర్థిక లావాదేవీలు, పరిపాలనా మార్పులు, నిధుల మళ్లింపు, ప్రభుత్వ భూముల బదిలీలపై కేంద్రీయ దర్యాప్తు సంస్థ (CBI) చేత సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.

శనివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పద్మనగర్ ప్రాంతంలో దాదాపు ఐదు దశాబ్దాల చరిత్ర కలిగి, నేడు రాష్ట్రంలోనే ప్రముఖ పాల ఉత్పత్తి సంస్థగా వెలుగొందుతున్న ఈ డెయిరీ నిర్వహణలో పారదర్శకత పూర్తిగా లోపించిందని బండారి శేఖర్ విమర్శించారు. ఒకప్పుడు ప్రభుత్వ పరిధిలోని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డెయిరీ డెవలప్‌మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ (APDDCF) కింద ‘విజయ డెయిరీ’ బ్రాండ్‌తో ప్రారంభమైన ఈ సంస్థ, తదనంతరం కరీంనగర్ డెయిరీగా ఎలా మారిందనే నిజాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. 1971 అక్టోబర్ 16న అప్పటి ముఖ్యమంత్రి పీవీ నరసింహారావు, వ్యవసాయ శాఖ మంత్రి జె. చొక్కారావుల కృషి ద్వారా రోజుకు 12 వేల లీటర్ల సామర్థ్యంతో ఈ ప్రభుత్వ డెయిరీ ప్రారంభమైందని గుర్తుచేశారు.

​చట్టపరమైన పరిణామాలను వివరిస్తూ, 1997 వరకు ప్రభుత్వ ఆధ్వర్యంలో 1964 సహకార సంఘాల చట్టం కింద నడిచిన ఈ సంస్థను 2003 నాటికి 1995 పరస్పర సహాయక సహకార సంఘాల చట్టం (MACS) కిందకు మార్చారని తెలిపారు. ఆ తర్వాత 2012 జూన్ 1వ తేదీన 1956 కంపెనీల చట్టం ప్రకారం ‘కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్‌’గా రూపాంతరం చెందిందని, విజయ బ్రాండ్ స్థానంలో వేములవాడ రాజరాజేశ్వర స్వామి కోడె మొక్కు ప్రతీక అయిన ‘నంది’ లోగోతో ఉత్పత్తులను మార్కెట్‌లోకి తెచ్చారని పేర్కొన్నారు. 2014లో అప్పటి కరీంనగర్ ఎంపీ, ప్రస్తుత రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఈ డెయిరీ నిర్వహణ, రైతులకు అందాల్సిన ప్రయోజనాలపై తీవ్రస్థాయిలో ఆరోపణలు లేవనెత్తిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.

​సహకార సూత్రాలకు విరుద్ధంగా సంస్థను ప్రైవేట్ లేదా కార్పొరేట్ తరహాలో నడపడాన్ని అడ్డుకొని, వచ్చే లాభాలన్నింటినీ నేరుగా పాడి రైతులకు అందేలా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని శేఖర్ కోరారు. డెయిరీ ఆస్తులు వేలాది మంది రైతుల జీవనాధారమని, ప్రభుత్వం స్పందించి సీబీఐ విచారణకు ఆదేశించకపోతే ఏఐఎఫ్బీ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>