కలం, వెబ్ డెస్క్ : ప్రపంచ చమురు, వాణిజ్య రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి (Strait Of Hormuz) గుండా భారత్, చైనా, ఇరాక్, ఖాతార్ దేశాలకు చెందిన నౌకలు ప్రత్యేక మినహాయింపు ఇస్తున్నట్లు ఇరాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇరాన్ ప్రకటనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖండించారు. హర్మూజ్ జలసంధి గుండా ఏ నౌకలు వెళ్లవచ్చో, ఏవి వెళ్లకూడదో ఇరాన్ నిర్ణయించలేదని.. కేవలం అమెరికా నావికాదళ దళాలే నిరంతరం పర్యవేక్షిస్తూ నిర్ణయిస్తాయని తేల్చి చెప్పారు.
మరోవైపు ఇరాన్‌పై అమెరికా అమలు చేస్తున్న ఆర్థిక, నావికా దిగ్బంధనం అత్యంత సమర్థవంతంగా సాగుతోందని ట్రంప్ అన్నారు. ఈ మేరకు ప్రస్తుతం ఇరాన్‌కు ఏ రకమైన వస్తువులూ వెళ్లడం లేదని చెప్పారు. చివరికి చమురు రవాణా కూడా పూర్తిగా నిలిచిపోయిందని స్పష్టం చేశారు. ఇక ఇరాన్ తో నెలకొన్న ఘర్షణను ‘యుద్ధం’గా పరిగణించలేమని ట్రంప్ పేర్కొన్నారు. గత ఐదు నెలలుగా ఈ ఘర్షణలో ఎవరూ గాయపడలేదు, చనిపోలేదు.. అలాంటప్పుడు దీన్ని యుద్ధంగా ఎలా భావిస్తారు? అని చెప్పుకొచ్చారు. ఘర్షణ ముందు కంటే ఇప్పుడే అమెరికా ఎక్కువ చమురు పొందుతుందని తెలిపారు. ఇరాన్ ఎలాంటి అక్రమ మార్గాల్లో చమురును ఎగుమతి చేయకుండా అమెరికా బలగాలు హర్మూజ్ మార్గంలో కఠిన తనిఖీలను కొనసాగిస్తాయని వెల్లడించారు.
హర్మూజ్ జలసంధి గుండా భారత్, చైనా, ఇరాక్, ఖాతార్ దేశాలకు చెందిన నౌకలకు ఇరాన్ ప్రత్యేక మినహాయింపు ఇచ్చిన వేళ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. హర్మూజ్ జలసంధి గుండా రవాణాల విషయంలో అమెరికాదే తుది నిర్ణయమని భారత్ తో సహా ఆయా దేశాలకు ట్రంప్ పరోక్షంగా వెల్లడించారు.

