కలం, నిజామాబాద్ బ్యూరో: ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించే ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Ila Tripathi) వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ (Nizamabad) కలెక్టరేట్లో గురువారం కలెక్టర్ అధ్యక్షతన క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్టు అమలుపై సమావేశం జరిగింది. జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రుల రిజిస్ట్రేషన్లు, రెన్యూవల్స్ గురించి కలెక్టర్ సమీక్షించారు. ప్రతి ఆసుపత్రి తప్పనిసరిగా జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ కింద రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలన్నారు.
క్లినకల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అమలులో నిర్లక్ష్యం వద్దు..
ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వహణ తీరు పట్ల ప్రత్యేక పర్యవేక్షణ జరుపుతూ, నిబంధనలు పక్కాగా అమలయ్యేలా చూడాలన్నారు. అన్ని నిబంధనలు పాటించే ఆసుపత్రులకే అనుమతులు, రెన్యూవల్స్ చేయాలని సూచించారు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ నిబంధనలు పాటించని ఆసుపత్రులకు అనుమతులు మంజూరు చేయకూడదని, నిబంధలకు అనుగుణంగా సదుపాయాలు కలిగి ఉన్న వారికి నిర్దేశిత గడువులోపు అనుమతులు మంజూరు చేయాలని తెలిపారు.
ఈ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరగాలని, ఎవరైనా అవకతవకలకు ఆస్కారం కల్పించినట్లు ఫిర్యాదులు వస్తే ఎంతమాత్రం ఉపేక్షించబోమని హెచ్చరించారు. బాధ్యులైన అధికారులు, సిబ్బందిని ఉద్యోగాల నుండి తొలగించేందుకు కూడా వెనుకాడబోమని కలెక్టర్ స్పష్టం చేశారు. ఏవైనా ఆసుపత్రులు రిజిస్ట్రేషన్ లేకుండా కొనసాగుతున్నట్లు అయితే వెంటనే నిర్వాహకులకు నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఆసుపత్రుల్లో వైద్య రుసుముల బోర్డులు ఏర్పాటు చేయాలి..
సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా, ప్రభుత్వం రూపొందించిన కొత్త నిబంధనలపై ఆసుపత్రుల నిర్వాహకులు అవగాహన పెంపొందించుకుని, వాటిని తూచా తప్పకుండా పాటించేలా చూడాలన్నారు. పార్కింగ్ ఏరియా, అగ్ని ప్రమాద నివారణ జాగ్రత్తలు వంటివి విధిగా పాటించాలని, అన్ని ఆసుపత్రుల్లో వైద్య రుసుముల వివరాలతో కూడిన బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.
ఆర్ఎంపీ వైద్యుల పట్ల నిఘా పెంచి అర్హత లేకుండా ఆసుపత్రులు నిర్వహిస్తున్న వారి పైన కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ గవర్నింగ్ కౌన్సిల్ చైర్ పర్సన్ డాక్టర్ కవితా రెడ్డి, అదనపు కలెక్టర్లు రాజాగౌడ్, భుజంగరావు, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిణి డాక్టర్ రాజశ్రీ, నిజామాబాద్, బోధన్ ఐఎంఏ శాఖల అధ్యక్షులు డాక్టర్ విశాల్, డాక్టర్ ముకరంజా, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

