కలం, వెబ్ డెస్క్: అక్రమాస్తుల కేసులో అరెస్టయిన డీఎస్పీ భీంరెడ్డి (DSP Bheem Reddy) కేసుపై ఆదాయపు పన్ను శాఖ మరింత లోతుగా దర్యాప్తు జరుపుతోంది. ఈ క్రమంలో ఆయనకు సంబంధించిన పలు ఆస్తులపై ఆంక్షలు విధిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ సంపాదించిన రెండు ఇళ్లతో పాటు సెటిల్మెంట్ చేసినందుకు బహుమతిగా వచ్చిన ఇన్నోవా కారును అటాచ్ చేసింది.
పటాన్ చెరు పరిధిలోని మొగుడంపల్లిలోని 3.20 ఎకరాల భూమిని కూడా జప్తు చేసింది. 2023 జులైలో జీపీఆర్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ముత్తంగిలో రెండు విల్లాలను పోతుగంటి ఇంద్రకరణ్ రెడ్డి పేరుతో భీంరెడ్డికి బదిలీ చేసింది. ఇందుకు ఎలాంటి డబ్బులు తీసుకోకపోవడం గమనార్హం. రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం వీటి విలువ రూ.12 లక్షలుగా పేర్కొన్నప్పటికీ వాస్తవ విలువ ఎన్నో రెట్లు ఉంటుందని ఐటీ అధికారులు స్పష్టం చేశారు.
పటాన్చెరు డీఎస్పీగా ఉన్నప్పుడే..
భీంరెడ్డి అరెస్టయ్యే నాటికి డీజీపీ కార్యాలయంలో పనిచేస్తున్నారు. గతంలో పటాన్చెరు డీఎస్పీగా పనిచేస్తున్న సమయంలోనే పెద్ద ఎత్తున అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఇప్పటికే గుర్తించారు. మరీ ముఖ్యంగా జీపీఆర్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి వ్యతిరేకంగా వచ్చిన ఎన్నో ఫిర్యాదులపై కేసులు నమోదు చేయకుండా ఉండటంతో ప్రతిఫలంగా రెండు విల్లాలను స్వీకరించినట్లు స్పష్టమైంది.
ఇదిలా ఉంటే.. మొగుడంపల్లిలో తన నాలుగెకరాల భూమిని తనకు అత్యంత నమ్మకంగా ఉండే హోంగార్డు లక్ష్మణ్ నాయక్ పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. ఒక వివాదాన్ని సెటిల్ చేసినందుకు గాను యాపిల్ ఎంటర్ప్రైజెస్ యజమాని ఆలూరి సురేష్ భీంరెడ్డికి ఇన్నోవా కారును బహుమతిగా అందించినట్లు ఆయనే స్వయంగా అధికారులకు వాంగ్మూలం అందించారు. ప్రస్తుతం భీంరెడ్డి బెయిల్ మీద బయట ఉండగా.. ఏసీబీతో పాటు ఐటీ విభాగం కూడా కేసును దర్యాప్తు చేస్తున్నాయి.

