కలం, వెబ్‌డెస్క్: ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు పోలింగ్ (MPTC ZPTC Polling) కొనసాగుతోంది. ఎన్నికల నేపథ్యంలో పలు జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కర్నూలు (Kurnool) జిల్లా కోసిగి మండలం ఆర్లబండలోని బూత్-2లో రిగ్గింగ్ జరుగుతోందని వైసీపీ నేతలు ఆరోపించడంతో అధికారులు పోలింగ్‌ను నిలిపివేశారు. టీడీపీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని వైసీపీ శ్రేణులు ఫిర్యాదు చేశాయి. మరోవైపు నెల్లూరు జిల్లా వెంకటాచలం పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. పరస్పర నినాదాలతో మొదలైన వివాదం తోపులాటకు దారితీయడంతో ఓటర్లు, మహిళలు భయాందోళనకు గురయ్యారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు.
కడప జిల్లా నందలూరులో దొంగ ఓట్లు వేస్తున్నారనే ఆరోపణలతో స్థానికులు కొందరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికేతరులు గ్రామంలోకి రావడంతో మహిళలు వారి కారును అడ్డుకుని అద్దాలు ధ్వంసం చేయడంతో పాటు కళ్లల్లో కారం చల్లారు. పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇక ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ నియోజకవర్గంలోని కూడేరు మండలం మరుట్ల మూడో కాలనీలో రిగ్గింగ్‌కు పాల్పడ్డారంటూ కూడేరు సీఐ రాజుపై ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఆగ్రహించిన వైసీపీ శ్రేణులు పోలింగ్ బూత్‌లోకి దూసుకెళ్లి బ్యాలెట్ పేపర్లను చించివేశారు. పోలీసుల వ్యవహారశైలిపై కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

