బేతుపల్లి వరద విపత్తుపై అధికారుల చర్యలు అభినందనీయం: పొంగులేటి

 కలం, ఖమ్మం బ్యూరో: వరద విపత్తు సమయంలో అధికారులు అత్యంత సమన్వయంతో వ్యవహరించి, ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ప్రజలను కాపాడటం అభినందనీయమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy) అన్నారు. గురువారం సత్తుపల్లి సింగరేణి కాలరీస్ గెస్ట్ హౌస్‌లో ఉమ్మడి ఖమ్మం జిల్లాల కలెక్టర్లు, సత్తుపల్లి, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు వివిధ శాఖల అధికారులతో బేతుపల్లి వరద (Bethupalli Flood) సహాయక చర్యలు, నష్టాలపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.

​ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి మండలాలు ఖమ్మం జిల్లా సత్తుపల్లి హెడ్‌క్వార్టర్స్ పరిధిలో సంభవించిన వరదలు, వాటి నష్టాలపై సమగ్రంగా చర్చించామన్నారు. రాత్రి సమయంలో ముంపు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన మత్స్యకారులను కాపాడేందుకు వెళ్లిన ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సాహసవంతంగా శ్రమించారన్నారు. బోట్లు బోల్తా పడినట్లు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు జరిగినప్పటికీ, అధికారులు అప్రమత్తంగా వ్యవహరించి అందరినీ సురక్షితంగా రక్షించారని తెలిపారు.

​గతంలో మున్నేరు వాగు వరద అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, భవిష్యత్తులో విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టిందని మంత్రి గుర్తుచేశారు. పోలీసు శాఖ నుంచి 1200 మంది, ఫైర్ డిపార్ట్‌మెంట్ నుంచి 700 మందిని ఎంపిక చేసి మొత్తం 1,900 మంది సిబ్బందికి పూర్తి స్థాయి శిక్షణ ఇచ్చామన్నారు. సుమారు రూ. 260-270 కోట్ల వ్యయంతో అత్యాధునిక పరికరాలను ఎస్డీఆర్ఎఫ్‌కు సమకూర్చడం వల్లే రాష్ట్రంలో ఎక్కడ విపత్తు వచ్చినా 45-50 నిమిషాల్లోనే సహాయక చర్యలు అందించేలా యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న సిబ్బందిలో ఇళ్లు లేని అర్హులకు ‘ఇందిరమ్మ ఇళ్లు’ మంజూరు చేసే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు.

​విద్యుత్, నీటిపారుదల, ఆర్‌అండ్‌బి, పంచాయతీ రాజ్, వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో దెబ్బతిన్న రోడ్లు, మైనర్ ఇరిగేషన్ చెరువులు, పంట నష్టాలపై క్షేత్రస్థాయిలో పరిశీలన జరపాలని ఆదేశించారు. కేవలం అధికారుల అంచనాలే కాకుండా కలెక్టర్లు, వ్యవసాయ అధికారులు స్వయంగా ఫీల్డ్ విజిట్లు నిర్వహించి, నిజంగా నష్టపోయిన రైతులను గుర్తించి రానున్న 2-3 రోజుల్లో పూర్తి స్థాయి డీటెయిల్డ్ ఎస్టిమేట్స్‌ను ప్రభుత్వానికి సమర్పించాలన్నారు.

​ఈ సమీక్షలో ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ, బేతుపల్లి చెరువు వద్ద ఇరుక్కుపోయిన 8 మంది మత్స్యకారులను, రెస్క్యూ సిబ్బందిని ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, పోలీసు శాఖల సమన్వయంతో విజయవంతంగా రక్షించామన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, జిల్లాలో రెడ్ అలర్ట్ నేపథ్యంలో ములకలపల్లి, అశ్వారావుపేట ప్రాంతాల్లో చెట్లపై, వరద నీటిలో చిక్కుకున్న గిరిజనులను, మహిళలను డ్రోన్లు, లైఫ్ జాకెట్ల సహాయంతో సురక్షితంగా కాపాడామని తెలిపారు. కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ మాట్లాడుతూ, విపత్తును ముందే పసిగట్టి ఎస్డీఆర్ఎఫ్ బృందాలను స్టాండ్‌బై ఉంచడం వల్ల, రాత్రంతా శ్రమించి ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా రెస్క్యూ ఆపరేషన్ పూర్తి చేశామన్నారు.

​ఈ సమావేశంలో సత్తుపల్లి, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు మట్టా రాగమయి దయానంద్, జారే ఆదినారాయణ, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, ఖమ్మం, కొత్తగూడెం అదనపు కలెక్టర్లు పి. శ్రీనివాస రెడ్డి, వేణుగోపాల్, ఉమ్మడి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>