కలం, వెబ్ డెస్క్: ఏపీలో జరుగుతోన్న స్థానిక సంస్థల ఎన్నికలపై మాజీ సీఎం, వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఇలాంటి ఎన్నికలు ఎక్కడా జరగలేదని.. ఇవి అసలు ఎన్నికలు కావని ఆరోపించారు. ఇవి ఎలక్షన్సా? లేక సెలక్షన్సా? అంటూ కూటమి సర్కార్‌పై మండిపడ్డారు. ఈ మేరకు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు.
అధికార దుర్వినియోగం, రౌడీయిజంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆరోపించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన హామీలు అమలు చేయలేదని.. అందుకే ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. మహాభారతంలోని శకుని మాయ పాచికల మాదిరిగానే ఎన్నికల్లో కూటమి సర్కార్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. చంద్రబాబు అన్ని రకాలుగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారని.. ఎన్నికల్లో చంద్రబాబు చేసినవన్నీ పాపాలే అంటూ దుయ్యబట్టారు. హామీల పేరుతో రాష్ట్ర ప్రజల్ని వెన్నుపోటు పొడిచారని.. ఎన్నికల ప్రక్రియను మొత్తం కబ్జా చేశారంటూ మండిపడ్డారు.

