కలం, వెబ్ డెస్క్ : సంక్రాంతి పండుగ సమీపిస్తున్న వేళ గాలిపటాల సందడి మొదలవుతున్న నేపథ్యంలో, నిషేధిత చైనీస్ మాంజా (Chinese manjha) విక్రయాలు, వాడకంపై నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనర్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ప్రాణాంతకమైన ఈ మాంజాను విక్రయించినా లేదా నిల్వ ఉంచినా ఏమాత్రం ఉపేక్షించబోమని, అటువంటి వారిపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు క్షేత్రస్థాయి పోలీసు అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేస్తూ, నిబంధనలు అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 ప్రకారం చైనీస్ మాంజా తయారీ, నిల్వ, అమ్మకాలపై ప్రభుత్వం పూర్తిస్థాయి నిషేధం విధించిందని కమిషనర్ గుర్తు చేశారు. గాలిపటాలు ఎగురవేయడం ఆనందదాయకమైన సంప్రదాయమే అయినప్పటికీ, అది ఇతరుల ప్రాణాలకు ముప్పుగా పరిణమించకూడదని ఆయన హితవు పలికారు. ఈ సింథటిక్ మాంజా భూమిలో కలిసిపోకుండా పర్యావరణానికి చేటు చేయడమే కాకుండా, మూగజీవాల స్వేచ్ఛకు, వాహనదారుల ప్రాణాలకు యమపాశంలా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
నగరవ్యాప్తంగా ఈ నిషేధాన్ని అమలు చేసేందుకు టాస్క్‌ఫోర్స్, స్థానిక పోలీసులతో కూడిన ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేశారు. నగరంలోని కైట్ షాపులు, గోదాములు, చిన్న దుకాణాలపై నిరంతరం ఆకస్మిక దాడులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కేవలం స్థానిక విక్రేతలే కాకుండా, ఇతర రాష్ట్రాల నుంచి చైనా మాంజాను అక్రమంగా తరలించే ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీలు, పార్శిల్ సర్వీసులపై కూడా నిఘా పెంచామని, తప్పు చేసినట్లు తేలితే సదరు సంస్థల యజమానులపై కూడా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల భద్రత పట్ల బాధ్యతగా ఉండాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. చైనీస్ మాంజా తయారీలో వాడే గాజు పెంకుల పొర, మెటాలిక్ పదార్థాల వల్ల పిల్లల వేళ్లు తెగిపోవడమే కాకుండా, విద్యుత్ తీగలకు తగిలినప్పుడు షాక్ తగిలే ప్రమాదం ఉందని వివరించారు. ద్విచక్ర వాహనదారుల ప్రాణాలకు సైతం ఇది పెనుముప్పుగా మారుతున్నందున, పిల్లలకు కేవలం సురక్షితమైన సంప్రదాయ నూలు దారాలను మాత్రమే అందించాలని కోరారు.
నగర ప్రజలు సామాజిక బాధ్యతతో స్పందిస్తూ, ఎక్కడైనా ఈ ప్రమాదకర మాంజా విక్రయాలు జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే డయల్ 100 లేదా పోలీస్ వాట్సాప్ నెంబర్ +91 94906 16555 కు సమాచారం అందించాలని పిలుపునిచ్చారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని ఆయన హామీ ఇచ్చారు.

Read Also: త్వరలోనే మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణ : డీజీపీ
Follow Us On : WhatsApp


