కలం, వెబ్ డెస్క్ : బెంగళూరు వేదికగా ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ADA) నిర్వహిస్తున్న ఏరోనాటిక్స్ -2047 జాతీయ సదస్సు (Aeronautics 2047 Conference) ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. జనవరి 4, 5 తేదీల్లో జరిగే ఈ రెండు రోజుల సదస్సును భారత వాయుసేన చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఓ చైర్మన్ డాక్టర్ సమీర్ వి కామత్, ఏడీఏ మాజీ డైరెక్టర్ డాక్టర్ కోట హరినారాయణ, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ జి. సతీష్ రెడ్డి, ఇస్రో చైర్మన్ డాక్టర్ వి. నారాయణన్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
తేజస్ (Tejas) యుద్ధ విమానం రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన ప్రముఖులను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. తేజస్ చీఫ్ ఆర్కిటెక్ట్ డాక్టర్ కోట హరినారాయణ, తేజస్ తొలి విమానాన్ని నడిపిన వింగ్ కమాండర్ (రిటైర్డ్) రాజీవ్ కొథియాల్, రక్షణ మంత్రి మాజీ శాస్త్రీయ సలహాదారు డాక్టర్ వి.కె. ఆత్రే, ఎల్సీఏ తేజస్ ఫ్లైట్ టెస్టింగ్‌లో కీలక భూమిక పోషించిన ఎయిర్ మార్షల్ (రిటైర్డ్) పి. రాజ్‌కుమార్, హెచ్ఏఎల్ మాజీ సీఎండీ డాక్టర్ సి.జి. కృష్ణదాస్ నాయర్లను వాయుసేన అధిపతి సన్మానించారు. స్వదేశీ పరిజ్ఞానంతో తేజస్‌ను ఒక వాస్తవ రూపంలోకి తీసుకురావడంలో వీరు చేసిన కృషిని ఈ సందర్భంగా కొనియాడారు. 2047 నాటికి వైమానిక రంగంలో భారత్ సాధించాల్సిన ప్రగతి, సాంకేతిక సవాళ్లపై ఈ సదస్సులో నిపుణులు చర్చిస్తున్నారు.

Read Also: హరీశ్‌రావుకు కొత్త తలనొప్పి
Follow Us On: X(Twitter)


