కలం డెస్క్ : మావోయిస్టు పార్టీ ఫస్ట్ బెటాలియన్ కమాండెంట్ బర్సె దేవా అలియాస్ సక్కు లొంగుబాటుకు కొనసాగింపుగా మరో అగ్ర నేత సైతం అదే దారిలో ఉన్నట్లు తెలంగాణ పోలీసులు లీక్ ఇచ్చారు. ఆ సరెండర్ ప్రక్రియకు ఇంకో రెండు వారాలు పట్టే అవకాశమున్నదని పేర్కొన్నారు. ఇప్పటికే పోలీసులతో టచ్‌లోకి వచ్చారని, కానీ స్పష్టమైన నిర్ణయం జరగడానికి సమయం పట్టొచ్చని సూచనప్రాయంగా తెలిపారు. ఆ అగ్రనేత ఎవరో కాదు… ప్రస్తుతం పార్టీలో సెకండ్ ర్యాంక్ లీడర్‌గా చెలామణి అవుతున్న తిప్పిరి తిరుపతి (Thippiri Tirupathi) అలియాస్ దేవ్‌జీ అని పోలీసులు తెలిపారు. ఆయనతో పాటు మరో కేంధ్ర కమిటీ సభ్యుడు కూడా లొంగిపోయే అవకాశమున్నదని, కానీ మీడియేటర్ల ద్వారా జరిగే ఆ ప్రక్రియకు కొంత సమయం పడుతుందన్నారు. హిడ్మా ఎన్కౌంటర్ సమయానికే దేవ్‌జీ పోలీసుల అదుపులోకి వచ్చారని, ప్రొటెక్షన్ టీమ్‌గా ఉన్న తొమ్మిదిమందితో పాటు ఆయన కూడా పట్టుబడినట్లు సమాచారం. అప్పటి నుంచీ పార్టీ అంతర్గత సమాచారాన్ని తీసుకోవడం, ఇంకా పార్టీతోనే ఉన్న సీనియర్ లీడర్ల వివరాలను సేకరించి వారిని కూడా లొంగిపోయేలా చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
చత్తీస్‌గఢ్‌లోని పరిస్థితులే కారణం ? :
ఆపరేషన్ కగార్ కారణంగా దండకారణ్యంలో పార్టీ కదలికలు ప్రశ్నార్థకంగా మారాయి. రెగ్యులర్‌గా జరిగే పార్టీ యాక్టివిటీస్‌తో పాటు ప్రజలను కలవడం, పార్టీ నేతలు సమావేశం కావడం దుస్సాధ్యంగా మారింది. అటవీ గ్రామాలు, గూడేల్లో ప్రజల మధ్యకు వెళ్ళే వాతావరణం కూడా లేకపోవడంతో తిండికి కూడా ఇబ్బందులు ఏర్పడ్డాయన్నది పోలీసుల వాదన. అక్కడ కదలికలకే ఆస్కారం లేకపోవడంతో చివరకు షెల్టర్ కూడా సమస్యాత్మకంగా మారిందని, ఈ కారణంగా తెలంగాణ-చత్తీస్‌గఢ్ సరిహద్దులోని అడవులకు వలస వస్తున్నట్లు తెలిపారు. కర్రెగుట్టల ఆపరేషన్ సందర్భంగానే కేంద్ర, రాష్ట్ర కమిటీలకు చెందిన కొంతమంది లీడర్లు సరిహద్దు అటవీ ప్రాంతానికి చేరుకున్నారని, లొంగిపోవడం మినహా వారికి మరో ప్రత్యామ్నాయమే లేదని వివరించారు.
నిర్బంధం, కుటుంబ సభ్యుల ఒత్తిడి :
మావోయిస్టు పార్టీకి చెందిన కొందరు అగ్రనేతలు తెలంగాణ సరిహద్దు అటవీ ప్రాంతానికి చేరుకున్న విషయం బైటకు పొక్కడంతో వారి కుటుంబ సభ్యుల ద్వారా పోలీసులు ‘సరెండర్’ ఒత్తిడి పెంచారు. అందులో భాగంగానే తిప్పిరి తిరుపతి తమ్ముడు గంగాధర్‌ను పోలీసులు సంప్రదించి ఓపెన్ లెటర్ ద్వారా అప్పీల్ చేయించే ఎత్తుగడను సక్సెస్‌ఫుల్‌గా అమలుచేశారు. గంగాధర్ కుమార్తె సుమ సైతం పత్రికల ద్వారా దేవ్‌జీకి లేఖ రాశారు. దశాబ్దాల “పెదనాన్నా.. అజ్ఞాత జీవితం వదిలి కుటుంబాన్ని చేరుకోండి. ఏ ప్రజల కోసం ఉద్యమబాట పట్టారో.. అదే ప్రజల్లో మేము కూడా భాగమే..” వ్యాఖ్యానించారు. దీనికి తోడు ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నట్లు వార్తలు రావడంతో ఆందోళన చెందిన సుమ.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి ట్విట్టర్ (ఎక్స్) ద్వారా రిక్వెస్టు చేశారు. అరెస్టు చేసినా అదుపులోకి తీసుకున్నా ఆయన ప్రాణానికి హాని తలపెట్టవద్దని, కోర్టులో హాజరుపర్చాలని కోరారు. ఒకవేళ ఆయన లొంగిపోవడానికి సిద్ధమైతే అందుకు అవకాశం కల్పించాలని కోరారు.
గణపతి ఆరా కోసమే ఆలస్యం? :
పార్టీ అగ్రనేత ముప్పాళ్ళ లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి ఎక్కడున్నాడనే సమాచార సేకరణపై కేంద్ర, రాష్ట్ర ఇంటెలిజెన్స్ పోలీసులు దృష్టి పెట్టారు. ఇప్పటికే లొంగిపోయిన మల్లోజుల వేణుగోపాల్, తక్కెళ్ళపల్లి వాసుదేవరావు ద్వారా కొంత సమాచారాన్ని సేకరించినా ఆ తర్వాతి పరిస్థితుల్లో మకాం మార్చిన వివరాలను దేవ్‌జీ ద్వారా తెలుసుకుంటున్నట్లు సమాచారం. ఆ సమాచారం మేరకు గణపతి కదలికలపైనా నిఘా వేసి మూడో కంటికి తెలియకుండా దిగ్బంధం చేసిన తర్వాత దేవ్‌జీ లొంగుబాటు లేదా అరెస్టును చూపించే అవకాశాలున్నాయి. బర్సె దేవా లొంగిపోయి రెండు రోజులైనా తెలంగాణ పోలీసులు శుక్రవారం రాత్రి వరకు అధికారికంగా ప్రకటించలేదు. స్వయంగా డీజీపీ శివధర్‌రెడ్డి శనివారం లాంఛనంగా స్టేట్మెంట్ ఇచ్చే అవకాశమున్నది. ఆ తర్వాత రెండు వారాలకు దేవ్‌జీ సరెండర్‌ను కూడా చూపెట్టనున్నట్లు పోలీసుల సమాచారం.

Read Also: గాంధీ కుటుంబంలో పెళ్లి సందడి.. రాబర్ట్ వాద్రా స్పెషల్ పోస్ట్
Follow Us On: Sharechat


