రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్‌కు లేదు: ఎంపీ వంశీకృష్ణ

కలం, ​పెద్దపల్లి: “లూజర్ ఆఫ్ ఆపోజిషన్”గా మారిన కేటీఆర్‌కు తెలంగాణ రైతుల గురించి గానీ, ప్రజా సమస్యల గురించి గానీ మాట్లాడే నైతిక అర్హత లేదని పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ (MP Gaddam Vamsi Krishna) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఎంపీలు ఏం చేస్తున్నారని పదేపదే ప్రశ్నిస్తున్న కేటీఆర్.. ముందు గత పదేళ్లలో బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ రైతుల సమస్యలపై ఎంతవరకు పోరాడారో సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు.

కేటీఆర్ వ్యాఖ్యలకు స్పందించిన ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ.. కేటీఆర్ వ్యాఖ్యలపై సూటిగా విమర్శలు గుప్పించారు. గత పదేళ్ల పాటు పార్లమెంట్‌లో బీఆర్‌ఎస్‌కు చెందిన ఎంపీలు ఉన్నప్పటికీ, రామగుండం ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ (RFCL) పునరుద్ధరణపై లేదా స్థానిక రైతులకు ఎరువుల సరఫరాపై పార్లమెంట్‌లో గానీ, అసెంబ్లీలో గానీ ఒక్కసారైనా మాట్లాడారా అని ప్రశ్నించారు.

​కాకా కుటుంబం కృషి అసమానం

గతంలో కాకా వెంకటస్వామి, వివేక్ లు రామగుండం ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్‌కు సంబంధించిన రూ.10 వేల కోట్ల రుణాన్ని మాఫీ చేయించి, దాని పునరుద్ధరణకు నాంది పలికారాని వంశీకృష్ణ గుర్తుచేశారు. ఆ కృషి ఫలితంగానే నేడు సుమారు 3 వేల మంది కార్మికులకు ఉపాధి దక్కిందని, తెలంగాణ రైతులకు స్థానికంగానే యూరియా లభించే వసతి ఏర్పడిందని తెలిపారు. బీఆర్‌ఎస్ హయాంలో తెలంగాణ రైతులు యూరియా కట్టల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతూ, ఎండనక వాననక గంటల తరబడి క్యూలలో నిలబడిన పరిస్థితులు ఉన్నాయని.. ఆ సమయంలో కేటీఆర్ రైతుల తరఫున ఏనాడైనా స్పందించారా అని నిలదీశారు.

​‘యువరాజు మాటలు.. దోపిడీ పాలన’

కేటీఆర్‌ను ఉద్దేశించి ఎంపీ మాట్లాడూతూ.. “మీరు చేసేవన్నీ దోపిడీలు, ల్యాండ్ కబ్జాలు. కానీ మాట్లాడేటప్పుడు మాత్రం యువరాజులాంటి మాటలు మాట్లాడుతారు” అని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై నోరు విప్పే ముందు గతంలో రైతుల కోసం తామేం చేశామో కేటీఆర్ ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు.​”ఖబర్దార్ కేటీఆర్! మీరు ‘లూజర్ ఆఫ్ ఆపోజిషన్’ మించి ఇంకేమీ కాలేరు” అని హెచ్చరించిన ఎంపీ, ఇప్పటికైనా ప్రజలను మభ్యపెట్టే రాజకీయాలు మానుకోవాలని స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>