కలం, కరీంనగర్ బ్యూరో: పేద ప్రజల ఆకలి తీర్చడానికి ప్రభుత్వం రూపాయి లేకుండా పంపిణీ చేస్తున్న ఉచిత రేషన్ బియ్యాన్ని పక్కదోవ పట్టిస్తూ, వాటికి పాలిష్ పట్టి ప్రముఖ బ్రాండ్ల పేరిట అధిక ధరలకు విక్రయిస్తున్న ఘరానా మోసాన్ని (Karimnagar Ration Scam) కరీంనగర్ టాస్క్ ఫోర్స్ అధికారులు బట్టబయలు చేశారు. టాస్క్ ఫోర్స్ ఏసీపీ సతీష్ నేతృత్వంలో నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో ఏకంగా 307 క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఆటకట్టించిన టాస్క్ ఫోర్స్..
పోలీసులకు అందిన పక్కా సమాచారం మేరకు ఏసీపీ సతీష్ తన బృందంతో కలిసి మంగళవారం కరీంనగర్ పరిసర ప్రాంతాల్లోని పలు గోదాములు, ప్రాసెసింగ్ యూనిట్లపై దాడులు నిర్వహించారు. పేదల నుండి తక్కువ ధరకు రేషన్ బియ్యాన్ని సేకరిస్తున్న కొందరు వ్యాపారులు, వాటిని ప్రత్యేక యంత్రాల ద్వారా పాలిష్ చేసి సన్న బియ్యంగా మారుస్తున్నట్లు అధికారులు కనుగొన్నారు. అనంతరం ఆ బియ్యాన్ని ‘జై శ్రీరామ్’ తో పాటు ఇతర ప్రముఖ బ్రాండ్ల పేర్లు ముద్రించిన సంచుల్లో నింపి మార్కెట్లో అసలైన సన్న బియ్యంగా నమ్మిస్తూ అధిక ధరలకు అమ్ముతున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
క్రిమినల్ కేసు నమోదు..
దాడుల్లో లభ్యమైన 307 క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు, ఈ మోసానికి పాల్పడిన రైస్ మిల్ యజమాని,రైస్ మిల్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్టి కరుణాకర్ పై క్రిమినల్ కేసు నమోదు చేశారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా, కల్తీ, మోసపూరిత విక్రయాల నెట్‌వర్క్‌లో ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో సమగ్ర విచారణ జరుపుతున్నారు. ప్రభుత్వ బియ్యాన్ని పక్కదోవ పట్టిస్తూ, ప్రజల ఆరోగ్యంతో పాటు జేబులకు చిల్లులు పొడుస్తున్న ఇలాంటి అక్రమార్కులపై పిడి యాక్ట్ కింద కఠిన చర్యలు తీసుకోవాలని, మార్కెట్లో లభించే బియ్యం నాణ్యతపై నిరంతరం నిఘా ఉంచాలని స్థానిక ప్రజలు అధికారులను డిమాండ్ చేస్తున్నారు.

