కలం, మంచిర్యాల : మంచిర్యాల (Mancherial) జిల్లాలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నస్పూర్ గేటు వద్ద ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు మహిళలు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను మందమర్రి మండలం గుడిపెల్లి గ్రామానికి చెందిన సౌందర్య, లక్ష్మి, పొన్నారం గ్రామానికి చెందిన సోనియా, సుమలతగా గుర్తించారు. మందమర్రి మండలం పొన్నారం, గుడిపెల్లి గ్రామాలకు చెందిన ఏడుగురు మహిళలు మంచిర్యాలలోని ఓ షాపింగ్ మాల్‌లో పనిచేస్తున్నారు.
ఎప్పటిలాగే సోమవారం ఉదయం ఆటోలో విధులకు వెళ్తుండగా నస్పూర్ గేటు వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆటో రోడ్డు దాటుతున్న సమయంలో అకస్మాత్తుగా ఓ బైక్ రావడంతో దాన్ని తప్పించే క్రమంలో మంచిర్యాల (Mancherial) నుంచి జైపూర్ వైపు వెళ్తున్న లారీ ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సౌందర్య, లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన సోనియా, సుమలత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. ప్రమాద ధాటికి ఆటో నుజ్జునుజ్జయింది.
పలువురు ప్రయాణికులు గాల్లోకి ఎగిరిపడిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. విషయం తెలుసుకున్న మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ. 25 వేలు, గాయపడిన వారికి రూ.10 వేల ఆర్థిక సాయం ప్రకటించారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు.
Also Read : గుజరాత్‌లో గేమ్స్ జాతర.. 76 లక్షల రిజిస్ట్రేషన్లు!
Follow Us On: X(Twitter)

