వర్షపు నీటిని సంరక్షిస్తూ పంటల సాగు: డాక్టర్ అర్చన

కలం, జోగులాంబ గద్వాల: ప్రస్తుత ఎల్ నినో పరిస్థితుల్లో వర్షపు నీటిని సంరక్షించుకుంటూ రైతులు పంటల సాగు చేపట్టాలని రైతు విజ్ఞాన కేంద్రం వ్యవసాయ శాస్త్రవేత్త, కో ఆర్డినేటర్ డాక్టర్ పి.అర్చన (Dr Archana) రైతులకు సూచించారు. సోమవారం ఐజ, వడ్డేపల్లి, మల్దకల్ మండలాల్లో పంటల క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించారు. ఐజ మండలం వెంకటాపూర్ గ్రామంలో ఎంఎవో జనార్ధన్, ఏఈవో నవీన్‌తో కలిసి పత్తి, కంది పంటలను పరిశీలించారు. తక్కువ వర్షపాతం, బోరుబావులు ఎండిపోవడంతో పత్తి పంట తీవ్రంగా దెబ్బతిన్నట్లు గుర్తించి.. పలు సూచనలు చేశారు. నీటి లభ్యత ఉంటేనే వరి వంటి రబీ పంటలు సాగు చేయాలన్నారు. అనంతరం వడ్డేపల్లి మండలం జూలకల్ గ్రామంలో కంది పంటను పరిశీలించారు.

సిఫార్సు చేసినవే వాడాలి..

మల్దకల్ మండలంలో ఎంఎవో రాజశేఖర్, క్లస్టర్ ఏఈవో రాహుల్ పైలట్‌తో కలిసి పత్తి, వరి, బెండ, టమాట పంటలను డాక్టర్ అర్చన పరిశీలించారు. పింక్ బోల్‌వార్మ్ నివారణకు ఫెరోమోన్ ట్రాపులను వినియోగించాలన్నారు. పురుగు ఉధృతిని బట్టి వ్యవసాయ అధికారులు సిఫార్సు చేసిన పురుగుమందులను మాత్రమే ఉపయోగించాలని సూచించారు. వరి పంటలో ఆకులు, కాండం ఎర్రబడటానికి కారణాలను ముందుగా నిర్ధారించిన తర్వాతే సస్య రక్షణ చర్యలు చేపట్టాలని తెలిపారు. బెండ, టమాట పంటల్లో చీడ పీడలు, వాడిపోయే తెగుళ్లను తొలిదశలో గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. సిఫార్సు చేసిన మోతాదుల్లోనే పురుగుమందులు వినియోగించి సమగ్ర సస్యరక్షణ పద్ధతులను పాటిస్తే పంట నష్టాలు తగ్గుతాయన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>